సెప్టెంబర్లో భారీగా రేషన్ కోటా.. రేషన్ పంపిణీలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధం!

సెప్టెంబర్లో భారీగా రేషన్ కోటా.. రేషన్ పంపిణీలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధం!
  • పదేండ్ల తర్వాత 9.97 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు
  • మొత్తం 99.97లక్షల కార్డులతో 3.21 కోట్ల మందికి లబ్ధి 
  • 1.68 లక్షల టన్నుల నుంచి 1.92 లక్షల టన్నులకు పెరిగిన నెల రేషన్​ కోటా
  • సెప్టెంబర్​ రేషన్ పంపిణీకి సివిల్​ సప్లయ్ శాఖ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్​ నెలలో  రేషన్​కోటా భారీగా పెరగనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ కార్డులు పెద్ద ఎత్తున మంజూరు చేయడంతో కొత్తగా భారీ సంఖ్యలో రేషన్​లబ్ధిదారులు జాబితాలో చేరారు. ఫలితంగా సెప్టెంబర్ నెల రేషన్ లో సన్న బియ్యం కోటా గణనీయంగా పెరగనుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. రేవంత్ సర్కారు..రేషన్​పంపిణీలో దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేసి కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు రేషన్​పంపిణీలోనూ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. 

39.60 లక్షల మందికి లబ్ధి

గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల 95వేల 282 రేషన్ ​కార్డులు ఉండగా.. 2 కోట్ల 81 లక్షల 47 వేల 565 మంది లబ్ధిదారులు ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్​ కార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజాపాలన ద్వారా రేషన్​ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అప్లై చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి  కొత్తగా  9 లక్షల 97 వేల 650 కార్డులను మంజూరు చేసింది. ఈ కార్డులకుగానూ 26 లక్షల 73 వేల 702 మంది లబ్ధిదారులు కొత్తకార్డుల్లో లబ్ధిదారులయ్యారు.  పాత రేషన్​ కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడానికి అనుమతించగా మరో 12 లక్షల 86 వేల 457 మంది కుటుంబ సభ్యులను చేర్చారు. దీంతో కొత్తగా 39 లక్షల 60 వేల 159 మంది లబ్ధిదారులకు అదనంగా అవకాశం దక్కింది. ఫలితంగా రాష్ట్రంలో రేషన్​కార్డులు సంఖ్య 99 లక్షల 92 వేల 932కు పెరిగాయి. రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 7 వేల 724 మందికి చేరింది. 

రేషన్ ​పంపిణీలో రికార్డ్!

రాష్ట్రంలో ఈ సెప్టెంబర్‌‌లో రికార్డు స్థాయిలో రేషన్​పంపిణీకి సర్కారు సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్రంలో ఉన్న 89.92 లక్షల రేషన్ ​కార్డులకుగానూ 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేశారు. నెలలో  రేషన్​ సరఫరాకు లక్షా 68 వేల 885 టన్నుల బియ్యం సరఫరా చేశారు. తాజాగా 3.21 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల  చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. దీంతో తాజా లబ్ధిదారులకు అనుగుణంగా  లక్షా 92 వేల  టన్నుల సన్నబియ్యం సరఫరాకు సిద్ధమైంది. అంటే  గతంలో కంటే ఈ సెప్టెంబర్ నెలలోనే 23 వేల 760 టన్నుల సన్న బియ్యం రేషన్​  ద్వారా అందనుంది. 

రేషన్​ కార్డులు, లబ్ధిదారుల వివరాలు రేషన్​ 


కార్డులు    లబ్దిదారులు    నెలకోటా       టన్నుల్లో
నేడు     99.97 లక్షలు    3.21 కోట్లు    1.92 లక్షలు
గతంలో     83.92 లక్షలు    2.81 కోట్లు    1.68 లక్షలు
పెరిగింది    9.97 లక్షలు    39.60 లక్షలు    23760 టన్నులు