తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తం : కేసీఆర్

తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తం : కేసీఆర్

అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గులాబీ సర్కార్ ఏర్పాటైతే రెండేళ్లలో మహారాష్ట్ర పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రది, తెలంగాణది రోటీ బేటీ సంబంధమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్..మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తనకు ఎవరితో పంచాయితీ లేదన్న సీఎం రైతుల కోసం పనిచేస్తానని చెప్పారు. మహారాష్ట్రలో ఎంతోమంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశంలో మార్పు కోసమే  జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా..ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు, నాయకులు మారినా.. దేశం తలరాత మారలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు సాగునీరు, తాగునీరు, కరెంట్  లేదన్నారు. 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బీజేపీ పాలించి  ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. దేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని కేసీఆర్ మండిపడ్డారు.