
పదో తరగతి సమాధాన పత్రాలు గల్లంతైన విద్యార్థులకు న్యాయం చేయడానికి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. వీరిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సహా ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచిస్తోంది. పదో తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తొమ్మిది మంది విద్యార్థుల తెలుగు పరీక్ష సమాధాన పత్రాలు గల్లంతైన విషయం తెలిసిందే.
పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పరీక్షాకేంద్రం నుంచి బస్టాండ్‌కు తరలిస్తున్న సమయంలో సమాధానపత్రాల బండిల్ కనిపించకుండా పోయింది. దీంతో ఆయా విద్యార్థులకు న్యాయం చేయాలన్న అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాలోచనలు చేశారు. విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహణ అంత సులభంకాదని గుర్తించారు. మినిమం మార్కులు వేసి పాస్ చేయడం శాస్త్రీయంకాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్‌చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు.
* ఒక విద్యార్థికి ఇంటర్నల్స్‌లో 20 మార్కులకు 11 మార్కులు వస్తే 5తో గుణించి (100 మార్కులకు లెక్కించి) 55 మార్కులు వేసే అవకాశం ఉంది.
* మరో విద్యార్థికి ఇంటర్నల్స్‌లో 20 మార్కులకు 19 మార్కులు వస్తే సంబంధిత విద్యార్థికి 95 మార్కులు వేసే అవకాశం ఉంది.
* ఇదే తరహాలో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులను పాస్‌చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.