ఆవిష్కరణలతోనే విప్లవాత్మక మార్పులు : జి.సతీశ్ రెడ్డి

ఆవిష్కరణలతోనే విప్లవాత్మక మార్పులు : జి.సతీశ్ రెడ్డి
  • దేశానికి ఉపయోగపడే ఇన్నోవేషన్స్ రావాలి    
  • భారత రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు సతీశ్ రెడ్డి
  • కేయూలో ప్రారంభమైన తెలంగాణ సైన్స్  కాంగ్రెస్

హనుమకొండ, వెలుగు: ఆవిష్కరణలతోనే విప్లవాత్మక మార్పులు వస్తాయని, దేశానికి ఉపయోగపడే ఇన్నోవేషన్స్  మరిన్ని రావాలని  డీఆర్డీవో మాజీ చైర్మన్, భారత రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహాదారు జి.సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్  అవసరం ఉందని, ప్రపంచ సాంకేతికతతో పోటీపడేలా ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్, మెషీన్  లర్నింగ్, సైబర్  సెక్యూరిటీ, క్వాంటం టెక్నాలజీ తరహా ఇన్నోవేషన్స్  రావాలని ఆకాంక్షించారు. 

తెలంగాణ ఆకాడమీ ఆఫ్  సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్  కాంగ్రెస్–-2025 మంగళవారం కేయూ ఆడిటోరియంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘ఇన్నోవేటివ్  స్కిల్స్  ఫర్  ఎంపవర్​మెంట్  సైన్స్  అండ్  టెక్నాలజీ ఫర్  ట్రాన్స్ ఫార్మింగ్  యంగ్  ఇండియా’ థీమ్ తో నిర్వహిస్తున్న సైన్స్  కాంగ్రెస్ కు వివిధ రాష్ట్రాల నుంచి 700 మంది ప్రొఫెసర్లు, పరిశోధకులు, మేధావులు హాజరుకాగా.. 750 రీసెర్చ్  పేపర్స్  సమర్పించారు. 

ముందుగా ప్లీనరీ సెషన్  నిర్వహించగా, కేయూ వీసీ కె.ప్రతాప్ రెడ్డి సైన్స్  కాంగ్రెస్ కు హాజరైన ప్రముఖులతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సైన్స్  కాంగ్రెస్  పుస్తకాన్ని రిలీజ్  చేశారు. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ యువత ఆవిష్కరణలే దేశాభివృద్ధికి ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలో పీహెచ్​డీ చేసే విద్యార్థుల్లో భారత్  మూడో స్థానంలో ఉందన్నారు. 2016లో 458 స్టార్టప్స్  మాత్రమే ఉండేవని, ఇప్పుడు 1.75 మిలియన్  స్టార్టప్స్  రావడం హర్షణీయమన్నారు. 

దేశంలో 4.34 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అని చెప్పారు. దేశంలో ఏటా 1.5 మిలియన్  మంది ఇంజినీరింగ్  పూర్తి చేస్తున్నారన్నారు. రూరల్ ఏరియా, కుటుంబ నేపథ్యం ముఖ్యం కాదని, కేవలం ఆలోచన సరళి మాత్రమే ముఖ్యమన్నారు. తమ ఆవిష్కరణ దేశానికి ఉపయోగపడేలా ఉండాలనే మైండ్ సెట్ యువతలో పెంపొందాలన్నారు. సాంకేతిక రంగంలో పట్టుసాధించి, కంపెనీలు పెట్టే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. 

డిఫెన్స్, టెక్నాలజీదే కీలక పాత్ర..

డీఆర్డీవో ఎల్ఆర్డీఈ డైరెక్టర్  జి.విశ్వం మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రక్షణ, సాంకేతికత పాత్ర ఎంతో కీలకమన్నారు. రీసెర్చ్  అండ్  డెవలప్​మెంట్  ఇన్  డిఫెన్స్  టెక్నాలజీస్, ఆపర్చునిటీస్  అండ్  ఛాలెంజెస్- ఏ 2047 పర్స్​పెక్టివ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైపర్సోనిక్  మిసైళ్లు, బ్యాలి స్టిక్, క్రూయిజ్  మిసైళ్లు, స్పేస్  మానిటరింగ్   సిస్టమ్స్, డ్రోన్లు, యాంటీ డ్రోన్  టెక్నాలజీస్, క్వాంటమ్  టెక్నాలజీస్, లేజర్  ఆధారిత ఆయుధాలు, ఏఐ, డీప్ లెర్నింగ్  వంటి లేటెస్ట్  టెక్నాలజీని డెవలప్  చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్  బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ దేశ యువత ఎడ్యుకేషన్, సైన్స్  అండ్  టెక్నాలజీలో ప్రపంచానికి పోటీ ఇస్తోందని తెలిపారు. దేశంలో 60 శాతం యువత ఉండడం గర్వకారణమని, మల్టీ డిసిప్లేన్  అప్రోచ్  నేటితరం ప్రత్యేకతగా పేర్కొన్నారు. 

తెలంగాణ అకాడమీ ఆఫ్  సైన్సెస్  ప్రెసిడెంట్  సీహెచ్.మోహన్ రావు, హైదరాబాద్  సీసీఎంబీ డైరెక్టర్  వినయ్  కె.నందుకూరి కేయూ రిజిస్ట్రార్  వి.రామచంద్రం, తెలంగాణ సైన్స్  కాంగ్రెస్  ఆర్గనైజింగ్  సెక్రటరీ బి.వెంకట్రామిరెడ్డి, తెలంగాణ అకాడమీ అఫ్  సైన్సెస్  జనరల్  సెక్రటరీ ఎస్.సత్యనారాయణ, ట్రెజరర్  ఎస్ఎం.రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్  హుస్సేన్  పాల్గొన్నారు.