తెలంగాణకు 37 వేల 600 కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు 37 వేల 600 కోట్ల పెట్టుబడులు
  • సీఎం రేవంత్​ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం
  • సీఎంతో గౌతమ్ అదానీ, టాటా సన్స్​ చైర్మన్​, విప్రో ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ భేటీ
  • రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​కు అదానీ గ్రూప్ ఎంవోయూ
  • రూ. 9 వేల కోట్లతో పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టుకు జేఎస్‌‌డబ్ల్యూ గ్రూప్ ఓకే
  • రూ. 8 వేల కోట్లతో గిగాస్కేల్ బ్యాటరీ సెల్​ తయారీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్న గోడి ఇండియా 
  • కొత్తగా రూ. 2 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన  ఆరాజెన్
  • రూ. 5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వెర్క్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్​లో పర్యటిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి అక్కడ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం సదస్సులో వివిధ కంపెనీల ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు దాదాపు రూ.37,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పెద్ద కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

ఇందులో రూ. 12,400 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్  ఓకే చెప్పింది. మరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ జేఎస్‌‌డబ్ల్యూ గ్రూప్ రూ. 9 వేల కోట్లతో పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఐదేండ్లలో రూ.8 వేల కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి, 6 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవల విస్తరణ కోసం కొత్తగా రూ.2వేల కోట్ల పెట్టుబడులు పెడ్తామని ఆరాజెన్ లైఫ్ సైన్సెస్  ప్రకటించింది. రూ. 5,200 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వెబ్ వెర్క్స్ సంస్థ ముందుకు వచ్చింది. మరోవైపు టాటా సన్స్ చైర్మన్​ ఎన్​.చంద్రశేఖరన్, విప్రో ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ రిషద్​ ప్రేమ్​జీ, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్​తోపాటు అమెజాన్​ తదితర అగ్ర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్​ భేటీ అయ్యారు. 

మాది ఫ్రెండ్లీ పాలసీ: సీఎం

ఇప్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకురావడం హర్షనీయమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని, దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. అదానీ గ్రూప్​తో పాటు వివిధ కంపెనీలు తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం సంతోషకరమని, దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ కీలక స్థానంగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడిదారులు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటిచెప్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 

వివిధ రంగాల్లో అదానీ గ్రూప్స్​ ఇన్వెస్ట్​మెంట్స్​

దావోస్‌‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌లో అదానీ గ్రూప్  చైర్మన్ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన  ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి,  మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ అండ్​ డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌‌లను ఏర్పాటు చేయనుంది. 

దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందన్​వెల్లిలో అదానీ కొనెక్స్ సంస్థ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు ఇన్వెస్ట్​ చేయనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో రూ.1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్​ను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ అండ్​  డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ అండ్​ డిఫెన్స్ సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అదానీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని గౌతమ్ అదానీ అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్

రాష్ట్రంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్  సంస్థ ఓకే చెప్పింది. ఇందు కోసం రూ. 5,200 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటెన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5,200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ  కుదుర్చుకుంది. హైదరాబాద్‌‌లో 10 మెగావాట్ల నెట్‌‌ వర్కింగ్- హెవీ డేటా సెంటర్‌‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతున్నది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్నేండ్లలో గ్రీన్‌‌ ఫీల్డ్ హైపర్‌‌ స్కేల్ డేటా సెంటర్​ను విస్తరించేందుకు తాజా ఒప్పందం చేసుకుంది. 

పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌‌ 

జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ  అనుబంధ సంస్థ జేఎస్​డబ్ల్యూ నియో ఎనర్జీ రాష్ట్రంలో రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్​డబ్ల్యూ నియో ఎనర్జీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దావోస్ లో జేఎస్​డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్  సీఎం రేవంత్​ రెడ్డితో  సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. కొత్త ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ మెయిన్​ ఆఫీస్​ ముంబైలో ఉంది. ఈ సంస్థ థర్మల్, హైడ్రో,​ సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా 4,559 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  సామర్థ్యాన్ని కలిగి ఉంది. జేఎస్​డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని,  భవిష్యత్ ప్రాజెక్టులపై సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆయన ప్రకటించారు.

మరిన్ని పెట్టుబడులకు గోద్రెజ్​ ఆసక్తి

దావోస్‌‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డితో గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌‌ భేటీ అ య్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపించింది. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ.270 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నది. మలేషియాకు చెందిన అతి పెద్ద పామాయిల్  కంపెనీ సిమ్ డార్బీతో గోద్రెజ్ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.1,000 కోట్ల కెమికల్ ప్లాంట్‌‌ను ఏర్పాటు
 చేసేందుకు గోద్రెజ్  అంగీకరించింది. దీంతో పాటు స్కిల్ డెవెలప్ మెంట్, రియల్ ఎస్టేట్,  క్రీమ్‌‌లైన్ డెయిరీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అంశాలపై చర్చించింది. 

త్వరలో స్కిల్ యూనివర్సిటీ

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. స్కిల్​ యూనివర్సిటీతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఓకే చెప్పారు.  ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్​ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని సీఎం రేవంత్​ స్వాగతించారు. 

విస్తరణ కోసం ఆరాజెన్​ రూ.2000 కోట్లు

రాష్ట్రంలో  ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ మరిన్ని పెట్టుబడులకు ఓకే చెప్పింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500  కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను సంస్థ విస్తరించనుంది. రాష్ట్రంలోని మల్లాపూర్‌‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతున్నది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాబోయే ఐదేండ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించటం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. హైదరాబాద్‌‌లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్, డివైజ్‌‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తున్నది. 

గిగా స్కేల్ బ్యాటరీ సెల్​ తయారీ కేంద్రం

గోడి ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ రాష్ట్రంలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకోసం రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 గిగావాట్ ఫర్ అవర్  సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నారు. గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి  సీఎం రేవంత్​తో సమావేశమయ్యారు. అదే వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా ఎంవోయూ కుదుర్చుకుంది. రాబోయే ఐదేండ్ల వ్యవధిలో రాష్ట్రంలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి  ఆర్​ అండ్​ డీ, గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ లను ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ అనుకూల వ్యవస్థను  నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంస్థ తెలిపింది.