రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తాం : అన్వేష్ రెడ్డి

రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తాం : అన్వేష్ రెడ్డి
  • ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొని మోసపోవద్దు  
  • వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలి
  • తెలంగాణ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి

కరీంనగర్ టౌన్/ రాజన్నసిరిసిల్ల, వెలుగు:  రాష్ట్రంలోని రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తామని తెలంగాణ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలకు చేరవేస్తున్నట్టు పేర్కొన్నారు.  మంగళవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.  విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన వరి విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు, కంది -150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుములు 400 క్వింటాళ్లు, వేరుశనగ -1,775 క్వింటాళ్లు అందిస్తున్నట్టు, అధికారులు ప్రణాళికబద్ధంగా రైతులకు అందించాలని సూచించారు. 

నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీలర్ల వద్ద విత్తనాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా రసీదు,ట్యాగు,లేబుల్ జాగ్రత్తగా  భద్రపరుచుకోవాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సొంత విక్రయ కేంద్రాల్లో ఆరు శాతం రాయితీతో విత్తనాలను అందిస్తుందని చెప్పారు.  కరీంనగర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, తెలంగాణ రీజనల్ మేనేజర్‌‌ విష్ణువర్థన్ రెడ్డి, సిరిసిల్ల  జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, విత్తన అధికారి మౌనిక, మండల వ్యవసాయాధికారులు, సీడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఐకేపీ ప్రతినిధులు, పీఏసీఎస్ డీలర్లు, డీసీఎంఎస్ ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాల డీలర్లు పాల్గొన్నారు.