9 ఏoడ్లల్లో 9 వేల మంది రైతులు ఆత్మహత్య : ప్రయోజనం లేని కాళేశ్వరం

9 ఏoడ్లల్లో 9 వేల మంది రైతులు ఆత్మహత్య : ప్రయోజనం లేని కాళేశ్వరం

కాంట్రాక్టర్లకు లాభాలు.. నేతలు, అవినీతి ఆఫీసర్లకు కమీషన్లు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్చుతున్నారు. రీడిజైన్​ పేరుతో అంచనాలను 300 శాతం పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఖర్చును 1లక్ష 20 వేల కోట్ల రూపాయలకు చేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వం ఎన్ని కాకి లెక్కలు చెప్పినా వాస్తవానికి ఈ ప్రాజెక్టు 59 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తున్నది. అయితే 18 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని ఇప్పటికీ కోట్ల రూపాయాలు ఖర్చు చేసి ఫేక్​ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ చార్జీలకే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

 అలాగే అప్పులపై వడ్డీలు పదివేల కోట్ల రూపాయలు తోపాటు పంపు హౌస్ లో నిర్వహణకు ఇంకో రూ.5000 కోట్లు ఇలా ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు పేరు మీద దాదాపు 25 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేని నిరర్థకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను చూసి సాగునీటి రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. పాత పైపులు పీకేసి కొత్త పైపులు వేయడం మాత్రమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రూ.40 వేల కోట్లు అప్పుచేసి ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఉంది. 

9 వేల మంది రైతుల ఆత్మహత్యలు

వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గమనించడం లేదు. అన్ని రకాల పంటలు మాన్పించి కేవలం వరినే ప్రోత్సహించడం వల్ల వరి ఉత్పత్తి పెరిగి ఉండవచ్చు కానీ రైతుల ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, అకాల వర్షాలు, కొనుగోలు సెంటర్లలో దోపిడీ, గిట్టుబాటు ధర రాకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, పంటల బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఎరువులు, విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీలు ఎత్తివేశారు. ఇలాంటి చిన్న సన్న కారు రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం నష్టదాయకంగా మారి ఈ తొమ్మిదేండ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతు సూసైడ్స్​లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

-ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ