అమరులకు నివాళులర్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం

అమరులకు నివాళులర్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం

నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు నివాళులర్పించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్మృతి కేంద్రాల వద్ద బీజేపీ సీనియర్ నాయకులు నివాళులర్పిస్తారు. ఆ వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 16వ తేదీన బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి.. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి.. వారి త్యాగాలను గుర్తు చేస్తారని ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. 

*  ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో ..     బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి

* కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో..   బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

*  నిజామాబాద్ ఖిలాలో(జిల్లా జైల్)..  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

* అదిలాబాద్ లో (నిర్మల్ లో1000 మందిని ఉరి తీసిన మర్రి చెట్టు).. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

* అదిలాబాద్ కోమురం భీమ్ జోడేఘాట్ వద్ద..   బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

*  సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లిలో..  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

* ఖమ్మం ఎరుపాలెంలో..    మాజీ ఎమ్మెల్యే ధర్మారావు

*  నల్గొండ గుండ్రంపల్లిలో..   బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ చార్జ్ మురళీధర్ రావు 

* మహబూబ్ నగర్ అప్పన్పల్లిలో..   బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

* హైదరాబాద్ కాచిగూడలోని షోయబుల్లాఖాన్ విగ్రహం వద్ద.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలె

అనాటి నిజాం ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడిన అమరవీరులకు నివాళులర్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా ఏళ్లుగా ఉద్యమాలు చేస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరపడం రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. MIM పార్టీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమైందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.