
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు పిల్ ఫలితంగా 2016లో తెలంగాణ రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్ చట్టం రూపొందించడమైనది. ఈ చట్టం చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ చేతివృత్తులవారి ఆర్థిక కష్టాలను పరిష్కరించడం లక్ష్యంగా రూపొందింది. 2018 మార్చి 12న ఏర్పడిన కమిషన్ ప్రైవేట్ రుణాలపై మధ్యవర్తిత్వం వహించి, వడ్డీ తగ్గించడానికి సిఫార్సులు చేసింది. అయితే, ఆదేశాలు జారీచేసే అధికారం లేకపోవడంతో దాని ప్రభావం పరిమితమై, 2021 మార్చిలో పదవీకాలం ముగిసిన తర్వాత నిష్క్రియాత్మకంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్ చట్టం చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తులవారికి ఆసరాగా నిలుస్తోంది. వ్యవసాయ భూమిలేని, కూలీగా జీవనోపాధి పొందేవ్యక్తిని వ్యవసాయ కూలీగా పరిగణిస్తారు. సంప్రదాయ పనిముట్లతో వ్యవసాయ సంబంధిత వస్తువులను ఉత్పత్తి లేదా మరమ్మతు చేసి జీవించేవారు, మత్స్యకారులు సహా గ్రామీణ చేతివృత్తులవారుగా గుర్తింపు పొందుతారు. వ్యవసాయ ఆదాయం ప్రధాన వనరుగా కలిగిన చిన్న రైతులకు, తడి భూమి అయితే ఒక హెక్టారు (షెడ్యూల్డ్ తెగలకు రెండు హెక్టార్లు), పొడి భూమి అయితే రెండు హెక్టార్లు (షెడ్యూల్డ్ తెగలకు నాలుగు హెక్టార్లు) మించకూడదు. కమిషన్ ద్వారా 'కష్టాల్లో ఉన్న రైతు'గా ప్రకటించినవారు ఈ చట్టం కింద లబ్ధి పొందుతారు. ఇందులో పైన పేర్కొన్న చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తులవారు అందరినీచేరుస్తారు.
కమిషన్ అధికారాలు
తెలంగాణ రుణ ఉపశమన కమిషన్.. ఈ చట్టం లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న ప్రాంతాలు, పంటలు లేదా రైతులకు సంబంధించి ప్రకటనలు చేయమని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఆర్థిక సంస్థలు కాకుండా ఇతర రుణదాతల విషయంలో ఇది సరసమైన వడ్డీరేటును, తగిన రుణస్థాయిని నిర్ణయిస్తుంది, ఇది కష్టాల్లో ఉన్న రైతు చెల్లించదగినదిగా భావిస్తుంది. రుణగ్రస్తులైన రైతులు, ఆర్థిక సంస్థలు కాకుండా ఇతర రుణదాతల మధ్య వివాదాలను పరిష్కరించడానికి కమిషన్ సయోధ్యను చేపడుతుంది. ఇది వివాదాలపై తీర్పులు ఇస్తుంది. ఇరుపక్షాలు కట్టుబడి ఉండే తుది అవార్డులను జారీ చేస్తుంది. వీటిని ఏ కోర్టులోనూ ప్రశ్నించలేం. కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ, వడ్డీరేటు ఉపశమనం, రుణ పునఃప్రణాళిక లేదా రుణ వాయిదా కోసం రుణదాతలతో కమిషన్ చర్చలు జరుపుతుంది. అదనంగా రైతులకు రుణ ఉపశమనాన్ని ఎంత మేరకు, ఏ విధంగా మంజూరు చేయాలి. రుణాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రైతుల భవిష్యత్తు రుణ అవసరాలు తీర్చటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్ కింద చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తులవారు నిర్ణీత పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. కమిషన్ కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక ఉపశమనాన్ని అందించడానికి అధికారం కలిగి ఉంది. ఇందులో కష్టాల్లో ఉన్న ప్రాంతాలు/పంటలు/రైతులను ప్రకటించడానికి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం, ఆర్థికసంస్థలు కాని రుణదాతల నుంచి సరసమైన వడ్డీరేటు, రుణస్థాయిని నిర్ణయించడం, వివాదాల పరిష్కారం కోసం సయోధ్య, తుది అవార్డులను జారీ చేయడం వంటివి ఉంటాయి.
రుణమాఫీ, వడ్డీ రేటు ఉపశమనం, రుణ పునఃప్రణాళిక లేదా రుణ వాయిదా కోసం రుణదాతలతో కమిషన్ చర్చలు జరుపుతుంది. ఇది ప్రభుత్వానికి రుణ ఉపశమనం, భవిష్యత్తు రుణ అవసరాలపై సిఫార్సులు చేస్తుంది, అలాగే ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను పునఃప్రణాళిక చేయడానికి, పెనాల్టీ వడ్డీని మాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. రుణాన్ని వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంది. ప్రధాన మొత్తంతోపాటు దానికి సమానమైన మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రుణం పూర్తిగా తీరినట్లు పరిగణిస్తారు. అయితే, రుణ ఉపశమనం రూ. 50,000 వరకు ఉన్న రుణాలకు 75% మించకూడదు. రూ. 50,000 పైన ఉన్న రుణాలకు 50% లేదా రూ. 1 లక్ష (ఏది తక్కువైతే అది) మించకూడదు. ఈ చట్టం కింద పరిష్కరించే విషయాలపై సివిల్ కోర్టులకు అధికార పరిధి ఉండదు.
ప్రభుత్వం కమిషన్‌ను బలోపేతం చేయాలి
కష్టాల్లో ఉన్న రైతుపై రుణ వసూలు కోసం ఎటువంటి దావా, డిక్రీ అమలుకోసం దరఖాస్తు చేయకూడదు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు తీసుకున్న అప్పులకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించడం, వడ్డీని లేదా అసలు మొత్తాన్ని తగ్గించడం, రుణాల పునర్వ్యవస్థీకరణకు సిఫార్సు చేయడం వంటి అధికారాలు దీనికి కల్పించారు. అయితే, ఈ కమిషన్ కేవలం 'సిఫార్సులకే' పరిమితమైంది తప్ప, ఆదేశాలు జారీ చేసే అధికారం లేకపోవడంతో దాని ప్రభావం పరిమితంగానే ఉండిపోయింది. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తులవారికి ఆర్థిక ఉపశమనం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. కేవలం రుణమాఫీలు మాత్రమే కాకుండా, రుణ ఉపశమన కమిషన్‌ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అప్పుల భయం లేకుండా, ఆత్మగౌరవంతో జీవించేలా రైతుకు భరోసా ఇవ్వగలిగితేనే నిజమైన 'రైతు రాజ్యం' సాకారమవుతుంది. రుణవిముక్తి అనేది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు. అది రైతుకు లభించే గౌరవం. రుణ ఉపశమన కమిషన్ ఒక పటిష్టమైన సాధనంగా మారడం ద్వారా అన్నదాతకు నిజమైన ఆశ్రయం లభిస్తుంది.
ప్రభుత్వానికి వార్షిక నివేదిక
వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతివృత్తులవారికి కూడా అవసరమైన చర్యలు, సిఫార్సులు చేస్తుంది. ఆర్థికసంస్థలు కాకుండా ఇతర రుణదాతలకు చెల్లించాల్సిన రుణాల తిరిగి చెల్లింపును కనీసం ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు వాయిదా వేయడానికి ఆదేశాలు జారీ చేయవచ్చు. రుణ ఉపశమనం ప్రధాన మొత్తం, వడ్డీ, జరిమానా వడ్డీ మాఫీ రూపంలో ఉంటుంది.
ఇది యాభై వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ రుణం అయితే 75% మించకూడదు. రుణం యాభై వేల రూపాయలు మించినట్లయితే, ఉపశమనం 50% లేదా లక్ష రూపాయలు (ఏది తక్కువైతే అది) మించకూడదు. ఈ చట్టం కింద తన అధికారాలను వినియోగించుకోవడానికి, కమిషన్ సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 కింద ఒక దావాను విచారించేటప్పుడు సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. కమిషన్ తన వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. అది శాసనసభ ముందు ఉంచడం జరుగుతుంది. కమిషన్ అకౌంట్స్ ఏటా ఆడిట్ చేస్తారు.
- డా. కట్కూరి, సైబర్ సెక్యూరిటీ, న్యాయ నిపుణుడు