
- డీపీసీలో ఆమోద ముద్ర..
- ఒకట్రెండు రోజుల్లో జీవో వచ్చే చాన్స్
- 2008 బ్యాచ్‌కు చెందిన 127 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్
- 13 మంది ఎస్‌ఈలకు సీఈలుగా ప్రమోషన్‌కు మార్గం సుగమం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ శాఖలో పదోతన్నతులకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. తొలుత 2008 బ్యాచ్ ఏఈఈలకు, ఎస్ఈలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు డీపీసీలో క్లియర్ అయినట్టు సమాచారం. 2008 బ్యాచ్‌కు చెందిన 127 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లను కల్పించేందుకు డీపీసీ ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది.
అలాగే, ఎస్ఈ నుంచి సీఈలుగా 13 మందికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం కనిపిస్తున్నది. కాగా, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి డీపీసీలో ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లకు ఆమోదం తెలపడం ఇదే తొలిసారి కావడం విశేషం. జోన్ 5, జోన్ 6 సమస్యలు, సీనియారిటీ ఇష్యూస్ అన్నింటినీ పరిష్కరించి.. ప్రమోషన్లకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిపార్ట్‌మెంట్‌లో ప్రక్షాళన చేస్తున్నది. అడ్‌హక్ ప్రమోషన్లు ఇవ్వబోమని చెప్పిన సర్కారు.. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొందరు సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించక తప్పలేదు. ప్రమోషన్లపై ఎప్పటినుంచో చర్యలు తీసుకుంటున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజినీర్లపై విజిలెన్స్ రిపోర్టు నేపథ్యంలో కొంత ఆలస్యమైంది.
త్వరగా జీవో ఇవ్వండి: 2008 బ్యాచ్ ఏఈఈలు
2008 బ్యాచ్ ఏఈఈలకు 17 ఏండ్ల తర్వాత ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయిందని, డీపీసీ ఆమోదం మేరకు వెంటనే జీవో జారీ చేయాలని సీనియర్ ఏఈఈలు కోరారు. ఇన్నేండ్లుగా కోర్టు కేసులు, సీనియారిటీ సమస్యలు, మల్టీ జోన్ సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా డీపీసీలో క్లియర్ చేసి ప్రమోషన్లకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏఈఈలు మేఘావత్ శ్రీనివాస్, శివకుమార్, శ్రీనివాస్, అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఏఈఈ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.