
- జీఎస్టీ రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో రాష్ట్ర సర్కార్
- కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
- కేంద్రం అంగీకరించకపోతే.. ట్యాక్స్ ను రాష్ట్రమే భరించే యోచన ?
- రాష్ట్రంలో చేనేతపై ఆధారపడిన కుటుంబాలు 57 వేల పైనే..
కరీంనగర్, వెలుగు: చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ ఆ రంగాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకెళుతోంది. దీంతో తెలంగాణలో చేనేత రంగంపై ఆధారపడిన సుమారు 55 వేల కుటుంబాలు గత నాలుగేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా కేంద్రానికి లేఖ రాయడంతో పాటు త్వరలో స్వయంగా కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ ను కలిసి సమస్యను వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఆదాయమే తక్కువ.. ఆపై జీఎస్టీ భారం..
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి 5 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రంలోని 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి నెల ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు మించడం లేదు. పవర్‌లూమ్, హ్యాండ్లూమ్ పరిశ్రమల్లో తక్కువ ఖర్చుతో తయారయ్యే వస్త్రాలతో పోలిస్తే మార్కెట్ లో చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గుతోంది. ఇప్పటికే మార్కెట్ లో రా మెటీరియల్ ధరలు పెరగడం, చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇలాంటి వారిపై జీఎస్టీ భారం మోపడం వారిని మరింత కష్టాల్లోకి నెడుతోంది.
చేనేత కార్మికుల గోస పట్టని కేంద్రం..
తెలంగాణకే ప్రత్యేకమైన ఇక్కత్ చీరలు నేసే పోచంపల్లి నేత కార్మికులు, కాటన్, పట్టు చీరలు నేసే నారాయణపేట, గద్వాల్ నేత కార్మికులు, గొల్లభామ చీరలు రూపొందించే సిద్దిపేట కార్మికులు, దర్రీస్, డబుల్ క్లాత్ చద్దర్లు తయారు చేసే వరంగల్, కరీంనగర్ కార్మికులతో పాటు రాష్ట్రంలోని అనేక మంది చేనేత కార్మికులు చేనేత మగ్గాలపై తువ్వాలలు, లుంగీలు, షర్టింగ్, డోర్ కర్టన్లు, డబుల్ కాట్ బెడ్ షీట్లు, దస్తకార్ ఆంధ్ర కాటన్ వంటి వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ ఉత్పత్తులపై జీఎస్టీ వేయడంతో రేటు పెరిగి తమ ఉత్పత్తులు అమ్ముడుపోక అవస్థలు పడుతున్నారు. 2017లో జీఎస్టీ విధానం అమలులోకి వచ్చినప్పుడు రియల్, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జీఎస్టీ పన్ను వేయాలని నిర్ణయించగానే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు, బీజేపీ లీడర్ల ఒత్తిడితో జీఎస్టీని రియల్ జరీపై 5 శాతానికి తగ్గించారు. తెలంగాణలో వేలాది మంది ఆధారపడిన చేనేతపై జీఎస్టీని తగ్గించాలని నాలుగేళ్లుగా ఇక్కడి సంఘాలు కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదు.
కేంద్రం అంగీకరించకపోతే..
కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీని రద్దు చేసేందుకు అంగీకరించని పక్షంలో, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే యోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జీఎస్టీగా చెల్లించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి పరిహారంగా అందజేసే అవకాశముంది. ఈ విధానం అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.