కేంద్ర ర్యాంకుల్లో వెనుకబడ్డ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ 

కేంద్ర ర్యాంకుల్లో వెనుకబడ్డ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ 

 ఏ అంశంలోనూ టాప్​టెన్​లో కనిపించలే
 పాలనలో 26, ఈక్విటీలో 25, ఫెసిలిటీస్​లో 21వ స్థానం

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ పని తీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో రాష్ట్రం వెనుకబడింది. ఐదు కేటగిరీల్లో 70 అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. పర్​ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) పేరుతో ర్యాంకులు, గ్రేడ్లు రిలీజ్ చేసింది. వీటిలో ఏ ఒక్కదాంట్లోనూ టాప్ టెన్​లో తెలంగాణ కనిపించకపోవడం గమనార్హం. 2019–20 అకడమిక్ ఇయర్​కు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్​లో లర్నింగ్ ఔట్ కమ్స్ అండ్ క్వాలిటీ, యాక్సెస్, ఇన్​ఫాస్ర్టక్చర్ అండ్ ఫెసిలిటీస్, ఈక్విటీ, గవర్నెన్స్ ప్రాసెస్.. కేటగిరీల్లో రాష్ర్టాలకు ర్యాంకులు, గ్రేడ్లను కేంద్రం ప్రకటించింది. మొత్తం వెయ్యి పాయింట్లకు పది లెవెల్స్​ కేటాయించింది. ఇందులో తెలంగాణ 772 పాయింట్లతో గతేడాది మాదిరిగానే ఐదో లెవెల్ గ్రేడ్–2 స్థానంలో నిలిచింది. స్టేట్ల వారీగా పరిశీలిస్తే 2018–19లో 757 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా, 2019–20లో 23వ స్థానంలోకి దిగజారింది. గతేడాదితో పోలిస్తే 15 పాయింట్లు పెరిగినా, మిగిలిన రాష్ర్టాల పర్​ఫార్మెన్స్​ పెరగడంతో తెలంగాణ స్థానం కిందికి పడింది. నిధులు కేటాయించకపోవడం.. స్టూడెంట్లు, టీచర్లపై పర్యవేక్షణ లేకపోవడం.. ఎంఈఓ, టీచర్ల ఖాళీలు.. టీచర్లకు శిక్షణ ఇవ్వకపోవడం.. బడుల్లో ఇన్​ఫ్రాస్ర్టక్చర్ సమకూర్చకపోవడం వంటి అంశాలు రాష్ట్రం వెనుకబాటుకు కారణంగా కనిపిస్తున్నాయి. లర్నింగ్ ఔట్ కమ్స్ అండ్ క్వాలిటీలో తెలంగాణ 12వ స్థానంలో నిలవగా, యాక్సెస్ లో 19వ స్థానం, ఇన్​ఫ్రాస్ర్టక్చర్ అండ్ ఫెసిలిటీస్ లో 21వ స్థానం, ఈక్విటీ కేటగిరీలో 25వ స్థానం, గవర్నెన్స్ మేనేజ్​మెంట్ లో 26వ స్థానంలో నిలిచింది.
గతేడాది కంటే కిందికి..
గవర్నెన్స్ మెనేజ్​మెంట్​విభాగంలో తెలంగాణ గతంలో 271 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచింది. 2019–20లో 238 పాయింట్లకు తగ్గి  26వ స్థానానికి పడిపోయింది. దీనికి సర్కారు పర్యవేక్షణ లేమి కారణం. విద్యాహక్కు చట్టం అమలు, స్టూడెంట్లకు యూనిక్ ఐడీల కేటాయింపు, మిడ్ డే మీల్స్​పర్యవేక్షణ, బయోమెట్రిక్ అటెండెన్స్, బడుల్లో టీచర్ల ఫొటోలు, సింగిల్ టీచర్ స్కూళ్లు, బడుల్లో సబ్జెక్టు టీచర్లు, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం తన వాటా ఇచ్చి సక్రమంగా వినియోగించడం, స్కూళ్ల ఇన్ స్పెక్షన్, టీచర్లకు ట్రైనింగ్, పీపీఈ, సీఎస్ఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్​కు కేటాయిస్తున్న నిధుల ఆధారంగా ఈ ర్యాంకును కేంద్రం కేటాయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ల డెవలప్​మెంట్​కు పెద్దగా నిధులు కేటాయించడం లేదు. పర్యవేక్షణా సక్రమంగా లేదు. దీంతో దేశంలోనే 26వ స్థానంలో నిలిచింది.
బడుల్లో ఫెసిలిటీలు లేక లాస్ట్​లోనే
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఫెసిలిటీస్ కల్పించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో ఈసారి ర్యాంకు దారుణంగా పడిపోయింది. కంప్యూటర్, సైన్స్​ల్యాబులు, క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, స్కూల్ యూనిఫామ్ సకాలంలో ఇవ్వడం, పుస్తకాలు సకాలంలో అందివ్వడం తదితర అంశాల ఆధారంగా పాయింట్లు ఇవ్వగా 2019–20లో 21వ స్థానంలో నిలిచింది. ఈక్విటీ విషయంలో తెలంగాణ గతంలో 15వ స్థానంలో ఉండగా, ఈసారి 25వ స్థానానికి దిగజారింది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ల చదువులు, డ్రాపౌట్స్, రూరల్ అర్బన్​ ప్రాంతాల్లో సర్కారు బడుల్లో చదవడం, బాలబాలికల అడ్మిషన్లు, వికలాంగ పిల్లలకు ఫెసిలిటీలు, టాయ్​లెట్ల ఫంక్షనింగ్.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకు ఇచ్చారు.