బీఆర్ఎస్​తోనే తెలంగాణ రాలే.. త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేదా?

బీఆర్ఎస్​తోనే  తెలంగాణ రాలే.. త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేదా?
  • అమరుల బలిదానాలు, జేఏసీని గుర్తించాలి
  • తెలంగాణ ఉద్యమకారులను యాద్ చేసుకోవాలె
  • ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు


దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గింది. ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో రాచరిక, భూస్వామ్య వ్యవస్థ అంతానికి, స్వేచ్ఛా వాయువుల కోసం సాయుధ పోరాటం జరిగింది. వేలాది మంది యువత బలిదానాల తర్వాత 1948, సెప్టెంబర్‌ 17న యూనియన్‌ సైన్యాల చర్యతో ఇండియాలో విలీనమైంది. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆంధ్రాలో విలీన టైంలో తెలంగాణలోని మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పటికీ పెద్ద మనుషుల ఒప్పందం మేరకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది.

హామీలిచ్చి ఉద్యమంపై నీళ్లు చల్లిన్రు

షరతులతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, ఆది నుండే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన జరిగింది. అప్పటి నుంచి ఉద్యమ ఆకాంక్షలు ప్రారంభమయ్యాయి. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారడంతో 373 మంది అమరులయ్యారు. అదే సమయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 11 మంది తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు, తెలంగాణ వాదులు గెలిచారు. అయినప్పటికీ కేంద్రం కొన్ని హామీలిచ్చి ఉద్యమంపై నీళ్లు చల్లించింది. అయినా మేధావులు, విద్యార్థులు, యువకులు తరుచూ రాష్ట్ర ఆకాంక్ష చాటుతూనే వచ్చారు. 1995 నుంచి తెలంగాణవాదం బలపడటంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.

నీళ్లు, నిధులు, నియామకాలే నినాదం

2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించడం, నక్సలైట్లు, ప్రగతిశీల శక్తుల ఐక్యతతో బలమైన ఉద్యమ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందు ప్రత్యేక తెలంగాణవాదం ఎజెండాగా నిలిచింది. యూపీఏ ప్రభుత్వం సీఎంపీ (కనీస అవసరాల కార్యక్రమం)లో ఈ అంశాన్ని చేర్చింది. జేఏసీకి ప్రొఫెసర్​ కోదండరాం చైర్మన్​గా ప్రత్యేక కమిటీ ఏర్పడింది. సీపీఐ తనదైన శైలిలో అసెంబ్లీలో, బయట ఉద్యమాల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. జేఏసీలో సీపీఐ భాగస్వామిగా లేకపోయినా కార్యక్రమాల పిలుపులో కలిసి ముందుకెళ్లింది. సీపీఐ అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్​ల ముందు ధర్నాలు, పికెటింగ్​లు, పాదయాత్రలు, అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహించింది.

పునర్విభజన చట్టానికి అనుకూలంగా ఓటేశాం

సీపీఐ జాతీయ పార్టీ అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటింది. ఇతర పార్టీలు తెలంగాణలో ఒక నినాదం, రాయలసీమ, ఆంధ్రలో మరో నినాదాన్ని వినిపించాయి. తెలంగాణ సాధనలో ఎర్రజెండాల అండ.. వెయ్యి ఏనుగుల బలమని ప్రజలు అనుకున్నారు. పార్లమెంట్​లో కూడా పునర్విభజన చట్టానికి అనుకూలంగా ఓటేసింది. తెలంగాణ ఏర్పడ్డాక నీటి వనరులు, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్‌ ఉత్పత్తిలో అభివృద్ధి సాధించింది. వైద్య రంగంలోనూ మెరుగైన ప్రగతి కనిపిస్తున్నది. అయితే, ఇచ్చిన హామీలు, ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదు. మానవ అభివృద్ధి జరగలేదు. వీటిపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పడేదా?

త్యాగాల్లేకుండా తెలంగాణ ఏర్పడేదా అనేది ప్రధాన ప్రశ్న. ఒక్క బీఆర్‌ఎస్‌ వల్లనే తెలంగాణ రాలేదు. అనేక రాజకీయ పార్టీల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు, వామపక్ష, ప్రగతిశీల శక్తుల ఉద్యమ స్ఫూర్తితో 
ఏర్పడింది. అమరుల త్యాగాలు, జేఏసీ, వివిధ రాజకీయ పార్టీల భాగస్వామ్యం, ప్రజాసంఘాలు, ఉద్యోగుల, సాంస్కృతిక సంఘాల పాత్రను గుర్తించకపోవడమంటే ఆ నాటి త్యాగాలు పాతిపెట్టడమే అవుతుంది. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ప్రస్థానం, 1995 తర్వాత నిరంతరంగా సాగిన రాష్ట్ర సాధన అంశాలు నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో దశాబ్ది ఉత్సవాలుంటే బాగుండేది.

అమరుల గురించి నేటి తరానికి తెలవాలె

కోచ్‌ ఫ్యాక్టరీ, గురుకుల విశ్వవిద్యాలయాలు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం లాంటి పునర్విభజన చట్టంలోని హామీలు ఇంకా అమలు కాలేదు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో ఇంకా తెలంగాణకు న్యాయం జరగలేదు. 2014న ఏర్పడ్డ తెలంగాణకు తొలి సీఎంగా కేసీఆర్ ఎన్నికయ్యారు.  దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలపైనే దృష్టి పెడుతున్నది. ఉద్యమ కాలంలో జైల్లో మగ్గిన వారిని, 1200 మంది అమరుల గురించి నేటి తరానికి తెలిసే కార్యక్రమాలు చేయాలి.

ప్రత్యేక తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు.. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాలు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం. ప్రతీ ఒక్కరి ఉజ్వల భవిష్యత్తు కలల రూపమే తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కారకులైన ప్రతి ఒక్కరినీ స్మరించుకోవాల్సిన తరుణమిది. బలిదానాలు చేసిన అమర వీరులకు జోహార్లు అర్పించాల్సిన సమయమిది. అన్ని వర్గాలను కలుపుకొని చేసుకోవాల్సిన సంబరమిది. నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, బడుగులు, పేదలు స్వరాష్ట్రంలో తమకు న్యాయం జరుగుతుందని, ఆశించిన ఫలితాలు లభిస్తాయని కలలుగన్నారు. వారి అభిప్రాయాలు గౌరవించి.. వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేసి.. పకడ్బందీగా అమలు చేయడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పునరంకింతం కావాలి..

చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు