పౌష్టికాహారంతోనే మెరుగైన ఆరోగ్యం

పౌష్టికాహారంతోనే మెరుగైన ఆరోగ్యం

ఏటూరునాగారం, వెలుగు: పౌష్టికాహారంతోనే ఆరోగ్యం మెరుగుపడుతుందని గర్భిణులు, బాలింతలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. పోషకాహార లోపం లేని జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలని ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీసులో మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పోషణ్ మాహ్’ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. పీవో అంకిత్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి జిల్లాలో మహిళల రక్షణ, పౌష్టికాహారం పంపిణీ, అంగన్ వాడీల నిర్వహణపై రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 65శాతం మహిళలు, 51శాతం గర్భిణులు రక్త హీనతతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. వారికి పౌష్టికాహారం అందించి ఈ సమస్యను అధిగమించాలన్నారు. జిల్లాలోని నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంగన్​వాడీ సెంటర్లలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ ఆఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, రేవతి, కృష్ణకుమారి, ఈశ్వరీబాయి, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఎంహెచ్ వో అప్పయ్య తదితరులున్నారు.

మహిళలకు అండగా నిలవాలి

ములుగు: సఖి కేంద్రానికి వచ్చే మహిళలకు అండగా నిలవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం ఆమె ములుగు జిల్లాకేంద్రంలోని సఖి సెంటర్ ను తనిఖీ చేశారు. బాధిత మహిళలకు వసతి, వైద్యం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, రక్షణ కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పట్ల చర్యలు తప్పవన్నారు. అనంతరం మహిళలు, బాలికల కోసం రూపొందించిన 181 టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆమె వెంట డీడబ్ల్యూవో ప్రేమలత తదితరులున్నారు.