
- ఎకరంలోపు ఎవుసంతో వచ్చేది అంతంతే.. ఇల్లు గడుసుడూ కష్టమే
- జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తల స్టడీలో వెల్లడి
- మూడున్నర ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు వచ్చేది రూ.13 వేలే
- ఆరున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులకు వచ్చేది రూ. 22 వేల లోపు
- వ్యవసాయానికి పశుసంపద తోడైతేనే అదనపు ఇన్కమ్
- కరీంనగర్ జిల్లాలో అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు
- ఈ జిల్లాలో 48% మంది రైతులు వరిసాగుకే మొగ్గు
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల ఆర్థికపరిస్థితి అధ్వానంగా ఉంది. ఎకరం, ఎకరంన్నరలోపు పొలం ఉన్న రైతులకు నెలకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం రూ.5 వేలు కూడా మించట్లేదు. మూడున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ.13 వేలు, ఆరున్నర ఎకరాల్లోపు ఉన్న మధ్యతరహా రైతులకు సగటున నెలకు రూ.22 వేలలోపే వ్యవసాయంతో ఆదాయం వస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. తెలంగాణ వ్యవసాయ విధానంపై అధ్యయనంలో భాగంగా కరీంనగర్ జిల్లాను కేస్ స్డడీగా తీసుకుని వర్సిటీకి చెందిన ఎండీ అలీబాబా, ఎం.గోవర్దన్, చిరంజీవి, ప్రగతికుమారి, కిరణ్ రెడ్డి, శృతిసాయి, ఎం.శరత్ చంద్రతో కూడిన శాస్త్రవేత్తల ఈ స్టడీ చేపట్టారు.
వ్యవసాయం, పాడి కలిగిన వివిధ కేటగిరీలకు చెందిన 211 రైతు కుటుంబాలను సర్వే చేశారు. ఇందులో 100 సన్నకారు రైతు కుటుంబాలు, 63 చిన్నరైతు కుటుంబాలు, 33 మధ్యస్త రైతు కుటుంబాలు, 15 బడారైతు కుటుంబాలు ఉన్నాయి. భూమి వినియోగం, పెట్టుబడి వ్యయం, దిగుబడి, ఆదాయం, నికర లాభాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ పరిశోధనాంశాలోని విశేషాలు జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్ లో మంగళవారం పబ్లిష్ అయ్యాయి. ఎకరం, ఎకరంన్నరలోపు పొలం ఉన్న సన్నరైతులకు నెల ఆదాయం రూ.5 వేలు మించట్లేదని తేలింది. పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు నెలకు రూ.38 వేలలోపు ఆదాయం వస్తున్నది. ఒకటి, రెండు పంటలు సాగు చేయడంతోపాటు పశుపోషణ చేసేవారి ఆదాయం ఎక్కువగా ఉందని, కేవలం వ్యవసాయం మీద వచ్చే ఆదాయం అంతంతేనని స్టడీలో తేలింది.
మిశ్రమ వ్యవసాయమే ఎక్కువ
శాంపిల్‌గా తీసుకున్న కుటుంబాల్లో 36 శాతం కుటుంబాలు మిశ్రమ వ్యవసాయం(పంటలు , పాడి) కలిగి ఉన్నాయి. అలాగే మరో 7 శాతం కుటుంబాలు పంటలు, పాడి, గొర్రెల పోషణ.. మరో 5 శాతం కుటుంబాలు పంటలు, పాడి, మేకల పోషణను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. పంట సాగు విషయానికొస్తే 48 శాతం మంది కేవలం వరిసాగుకే పరిమితమయ్యారు. కొందరు రైతులు మాత్రం రెండో పంటగా మిర్చి లేదా వేరుశనగ సాగుచేస్తున్నారు. అలాగే కొందరు ఒకే సీజన్ వరితోపాటు కంది, శనగవంటి పప్పుదినుసులను సాగు చేస్తున్నారు. కొందరు కూరగాయలు కూడా పండిస్తున్నారు.
వార్షికాదాయం ఇలా..
-
ఎకరంన్నరలోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి వ్యవసాయం మీద రూ. 56,551.. పాడి, పశుపోషణ ద్వారా రూ.41,352.. వ్యవసాయ కూలీ, ఉపాధి హామీ పథకం, స్వయం ఉపాధి పనుల ద్వారా మరో రూ.29,264.. మొత్తంగా రూ.1,27,167 మాత్రమే వస్తున్నాయి. కేవలం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం వరకే చూస్తే సన్నకారు రైతు ఆదాయం నెలకు సగటున రూ.5 వేలు కూడా మించడం లేదు.
- మూడున్నర ఎకరాల్లోపు ఉన్న చిన్నరైతులకు ఏడాదికి వ్యవసాయం మీద రూ.1,53,648.. పాడి, పశుపోషణ ద్వారా రూ. 52,120.. కూలీ, ఈజీఎస్, ఇతర పనుల ద్వారా మరో రూ. 24,397.. మొత్తం రూ.2,30,165 మాత్రమే వస్తున్నాయి. కేవలం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం వరకే చూస్తే చిన్నకారు రైతు ఆదాయం నెలకు సగటున రూ.13 వేలు కూడా మించడం లేదు.
- ఆరున్నర ఎకరాల్లోపు ఉన్న మధ్య తరహా రైతులకు ఏడాదికి వ్యవసాయం మీద రూ. 2,71,018.. పాడి, పశుపోషణ ద్వారా రూ. 64,852.. ఇతర పనుల ద్వారా మరో రూ.28,185.. మొత్తంగా రూ. 3,64,055 వస్తున్నాయి. కేవలం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే మధ్యతరహా రైతు ఆదాయం నెలకు సగటున రూ.22 వేలుగా ఉంటున్నది.
- పదిన్నర ఎకరాలకుపైగా పెద్ద రైతులకు ఏడాదికి వ్యవసాయం మీద రూ. 4,67,346.. పాడి, పశుపోషణ ద్వారా రూ. 71,900.. ఇతర పనుల ద్వారా మరో రూ. 48,152.. మొత్తంగా రూ.5,87,398 వస్తున్నాయి. కేవలం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే ఈ రైతుల ఆదాయం నెలకు సగటున రూ.38 వేలుగా ఉంటున్నది.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలివే..
అన్ని రకాల రైతులు ప్రధానంగా కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సలహాలు లభించడంలేదు. గొర్రెలు, మేకలు, పశువులకు మేత కొరత ఇబ్బందికరంగా మారింది. ఎకరంన్నరలోపు ఉన్న చిన్న రైతులకు అప్పు పుట్టడం లేదు. సన్న, చిన్నకారు రైతులు తక్కువ నీటి లభ్యత, మార్కెటింగ్ సవాళ్లతోపాటు తగినంత లాభదాయకమైన ధర లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వ్యవసాయ వర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇవన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం(ఐఎఫ్ఎస్)కు ప్రతిబంధకాలుగా మారాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధన పత్రంలో ప్రస్తావించారు.
రైతులు, ప్రభుత్వానికి సూచనలు
- రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగును అలవర్చుకోవాలి.
- మార్కెట్ లో డిమాండ్ ఉండే పంటలను ఎంచుకోవాలి.
- వ్యవసాయంలో నూతన సాంకేతికతను, డ్రిప్ ఇరిగేషన్ వంటి విధానాలను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తేవాలి.
- చిన్న రైతులకు రుణ, మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరచాలి.
- కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు వ్యవసాయానికి తోడుగా పశుపోషణ, కూరగాయలు, కోళ్ల పెంపకం వంటి పనులు చేపట్టాలి.
- పశువుల పెంపకంతో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు.