మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో  ఆయిల్ పామ్ సాగు
  • ప్రతి జిల్లాలో లక్ష ఎకరాల ప్లాంటేషన్  లక్ష్యం
  • నర్మెట్టలో ఫ్యాక్టరీ పనులు స్పీడప్

హైదరాబాద్, వెలుగు: హార్టికల్చర్  రంగంలో ఆయిల్ పామ్  సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రాబోయే మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్  ప్లాంటేషన్‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సాగు చేస్తున్న ప్రతి జిల్లాలో కనీసం లక్ష ఎకరాల్లో తోటలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న భారీ ఆయిల్ పామ్  ప్రాసెసింగ్  ఇండస్ట్రీ పనులను వేగవంతం చేస్తున్నారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్  చేయాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం,జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్  మిల్లుల పనులను సమీక్షిస్తూ, కల్లూరుగూడెం ఫ్యాక్టరీని వచ్చే ఏడాది జూన్  నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీచుపల్లి ఫ్యాక్టరీ కోసం టెండర్లు ఆహ్వానిస్తోంది.

డిమాండ్ కు తగ్గట్లు మొక్కల నిల్వలు

2026–27 సీజన్‌‌‌‌‌‌‌‌కు ఐఐఓపీఆర్  నిబంధనల ప్రకారం నర్సరీలు నిర్వహించి, నాణ్యమైన మొక్కలను రైతులకు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నర్సరీ స్థాయిలోనే కల్లింగ్  మొక్కలను నిర్మూలించి, డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా మొక్కల నిల్వలు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబరులో ప్లాంటేషన్  ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున నర్సరీలలో మొక్కలను పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2026–-27కు అవసరమైన సీడ్  విత్తన మొలకలను ముందుగానే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, తక్కువ ఎత్తు పెరిగే, ఆకు నిడివి తక్కువగా ఉండి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు ఇచ్చింది.

సౌకర్యాలు, స్థానిక ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌పై దృష్టి

మలేషియా తరహా ఫైబర్  స్టిక్స్, స్లాషర్స్, ష్రెడ్డర్స్  వంటి యంత్రాలను కస్టమ్  హైరింగ్  సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్​పామ్​ సాగు పురోగతి సంతృప్తికరంగా ఉండగా.. భువనగిరి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, జనగామ, సిద్దిపేటలో సాగు తక్కువగా ఉండడంతో వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ పామ్  గెలలను స్థానిక కర్మాగారాల్లోనే ప్రాసెస్  చేసి వినియోగించాలని, ఇతర రాష్ట్రాలకు విక్రయించకుండా నిఘా పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే హార్టికల్చర్  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్  పామ్ తోటల్లో మెకడమియా, కోకో, అరికనట్ వంటి అంతర పంటలు వేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. 

డ్రిప్​ ద్వారా నీటి వినియోగం

ఆయిల్ పామ్  మొక్కలకు నీటి అవసరం ఎక్కువ కావడంతో డ్రిప్  ఇరిగేషన్  సదుపాయంతోనే నాటాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. డ్రిప్  కంపెనీలు, ఆయిల్ ఫెడ్, ఇతర కంపెనీల అధికారులు, హార్టికల్చర్  సిబ్బంది ఎప్పటికప్పుడు మెయింటెనె న్స్‌‌‌‌‌‌‌‌పై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి ఫర్టిగేషన్  పద్ధతిలో ఎరువులు వినియోగించాల ని సలహా ఇచ్చింది.