డైలమాలో టీడీపీ కేడర్.. చంద్రబాబు అరెస్ట్​తో పార్టీ కార్యక్రమాలకు బ్రేక్

డైలమాలో టీడీపీ కేడర్..  చంద్రబాబు అరెస్ట్​తో పార్టీ కార్యక్రమాలకు బ్రేక్
  • అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కాసాని
  • ఆగిన బస్సు యాత్ర.. నిలిచిపోయిన అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్​తో తెలంగాణలో ఆ పార్టీ చేపట్టే ప్రోగ్రామ్స్​కు బ్రేక్ పడింది. దీనికి తోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌ అనారోగ్యంతో హాస్పిటల్‌‌‌‌లో చేరారు. తిరిగి కోలుకున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో టీడీపీ స్టేట్ కేడర్​లో డైలమా కొనసాగుతున్నది. 

Also Read : -అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ : పద్మాదేవేందర్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ దాదాపు సిద్ధమైంది. మొదటి విడతగా 40 మంది పేర్లు ప్రకటించేందుకు రెడీ అయ్యారు. కాసాని ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసంలో అభ్యర్థులతో భేటీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు ప్రకటించే టైమ్​కు చంద్రబాబు అరెస్ట్ కావడంతో జాబితా రిలీజ్​కు బ్రేక్ పడింది.

 

ఆగిన బస్సు యాత్ర..

సెప్టెంబర్‌‌‌‌ రెండో వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని టీడీపీ లీడర్లు నిర్ణయించారు. రెండు మూడు సార్లు ప్రకటనలు తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు. అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేశాక జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద చంద్రబాబుతో జెండా ఊపి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని భావించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బస్సు యాత్రకు కూడా బ్రేక్ పడింది.

తెలంగాణలో ఒంటరి పోరే..

రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని పోయిన నెలలోనే పార్టీ కేడర్​కు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 40 శాతం టికెట్లు యువతకు ఇస్తామని వెల్లడించారు. ఇండియా కూటమికి టీడీపీ దూరంగా ఉండటంతో.. కాంగ్రెస్​తో పొత్తు ఉండదని స్పష్టమైంది. అయితే, ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన ఎన్డీఏలో చేరినా.. చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు సిద్ధంగా లేదు. 

చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి.. 

తెలంగాణలో జరిగిన అభివృద్ధి మొత్తం టీడీపీ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని గతంలోనే పార్టీ కేడర్​కు చంద్రబాబు సూచించారు. విజన్ 2020 పెట్టి హైదరాబాద్​ను అభివృద్ధి చేశామని, విజన్ 2047తో ముందుకు సాగుతామనే విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఉండటం ఎంతో అవసరమనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.