తండాలకు తొవ్వలేవి?.. జీపీలుగా అప్​గ్రేడ్​ చేసినా బీటీ రోడ్లు వేయని రాష్ట్ర సర్కారు

తండాలకు తొవ్వలేవి?.. జీపీలుగా అప్​గ్రేడ్​ చేసినా బీటీ రోడ్లు వేయని రాష్ట్ర సర్కారు
  • చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్న తండాలరోడ్లు
  • అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు తప్పని తిప్పలు

మహబూబ్​నగర్​/బాలానగర్​/హన్వాడ, వెలుగు: తండాలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చాక జీపీలుగా అప్​గ్రేడ్​ చేశామని చెబుతుందే తప్ప, కనీసం రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు బీటీ రోడ్లు కూడా వేయలేదు. ఏండ్ల కింద వేసిన మట్టి రోడ్లే దిక్కవుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్​ వాహనాలు తండాలకు రావడం లేదు. దీంతో తండాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి తిప్పలు తప్పడం లేదు.

తండాలపై చిన్నచూపు..

మహబూబ్​నగర్​ జిల్లాలో 9 లక్షల పైచిలుకు జనాభా ఉండగా, అందులో లక్షకు పైగానే గిరిజనులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 101 తండాలు ఉంటే, అందులో 77 తండాలను రాష్ట్ర సర్కారు జీపీలుగా గుర్తించింది. బాలానగర్​ మండలంలో 19, మిడ్జిల్​లో 17, కోయిల్​కొండలో 12, ఉమ్మడి గండీడ్​ మండలంలో 14, మిడ్జిల్​ మండలంలో 5 తండాలు ఉన్నాయి. మరో 24 తండాలు ఈ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి. కానీ, మెజార్టీ తండాలకు ఇప్పటి వరకు సరైన రోడ్డు సౌలత్​ లేదు. బాలానగర్ మండలంలో 8 గిరిజన జీపీలకు రోడ్లు లేవు. అందులో నామ్యాతండాకు 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డే ఉంది. పలుగుమీదితండా 2.50 కిలోమీటర్ల పొడవునా, పెద్దబైతండా 3 కి.మీ, జీడిగుట్ట తండా ఒక కి.మీ, మేడిగడ్డతండా 2 కి.మీ, మాచారంతండా 2 కి.మీ, జాల్​గడ్డతండా ఒక కి.మీ, ఊట్కుంటతండాకు 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డే ఉంది. మిడ్జిల్ మండలంలో 17 తండాలుంటే మర్లబాయితండా, చౌటగుట్ట తండాలకు మాత్రమే బీటీ రోడ్డు ఉంది. మిగిలిన తండాలకు మట్టి రోడ్డు దిక్కవుతోంది. కాగా, ఈ మండలంలోని లింబ్యా తాండ, ఈదులబాయి తండాలకు బీటీ రోడ్లు శాంక్షన్  అయ్యాయి. టెండర్లు కూడా పిలిచారు. కానీ, కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ లెక్కన జిల్లాలో 77 గిరిజన జీపీలలో 40 తండాలకు మట్టి రోడ్లే ఉన్నాయి.

వర్షాలు పడితే బురదే..

తండాలకు వెళ్లే మట్టి రోడ్లు వర్షాలు పడితే అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ గుంతలు పడి, వర్షపు నీరు చేరుతుండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఎర్ర మట్టి రోడ్లు ఉన్న చోట బైకుల మీద వెళితే స్కిడ్​ అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా రావడానికి ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో పేషెంట్లు, గర్భిణులను హాస్పిటల్స్​కు తీసుకెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. మెయిన్​ రోడ్​ వరకు బైకుల మీద తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆటోలు, జీపులు, కార్లల్లో హాస్పిటల్స్​కు తరలిస్తున్నారు. తండాలను జీపీలుగా అప్​గ్రేడ్​ చేసిన వెంటనే ప్రత్యేక ఫండ్స్​ కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌలత్​ కల్పిస్తామని హామీ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తండాలను విజిట్​ చేసిన ప్రతీసారి బీటీ రోడ్లు వేయిస్తామని ప్రకటనలు చేశారు. కానీ, ఇంత వరకు తండాలకు బీటీ రోడ్లు వేయడంపై దృష్టి పెట్టడం లేదు.

తండాకు ఆటో రాలే...

నాకు 70 ఏండ్లు. రోడ్డు మంచిగ లేక ఇప్పటి దాకా మా తండాకు ఆటో కూడా రాలే. నాలాంటోళ్లకు జబ్బు చేస్తే పరిస్థితేందో తెలుస్తలేదు. దవఖానకు పోవాలన్న తిప్పలు తప్పుత లేవు. తండాకు కొత్త రోడ్డు వేయాలి.

 లచ్యా నాయక్​, సోమ్లాతండా, రాజాపూర్​ మండలం

పట్టించుకుంటలేరు..

మా తండాకు బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను చాలా సార్లు అడిగినా, పట్టించుకోవడం లేదు. రోడ్డు కావాలని కలిసినప్పుడు అందరి ముందు చూద్దాం.. చేద్దాం అంటారు. తర్వాత దాని గురించి పట్టించుకోరు.

రాజు, వార్డు మెంబర్​, సోమ్లాతండా, రాజాపూర్​ మండలం

ఇది మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లి నుంచి చిర్మల్​కుచ్చతండా, హనుమాన్​టెంపుల్​తండా వెళ్లే రోడ్డు. పదేండ్లుగా ఇలాగే ఉంది. కంకర తేలడంతో బైక్​లు కూడా వెళ్లలేని పరిస్థితి. మహబూబ్​నగర్​ పట్టణానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, ఇంత వరకు ఈ రోడ్డు బాగు చేయలేదు. లీడర్లు, ఆఫీసర్లను కలిసి బీటీ రోడ్డు వేయాలని అక్కడి గిరిజనులు కోరుతున్నా పట్టించుకుంటలేరు.

ఇది మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం మల్లేపల్లి గ్రామ పంచాయతీలోని సోమ్లాతండాకు వెళ్లే రోడ్డు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇలా మట్టి రోడ్డే ఉంది. వర్షాలు పడిన ప్రతిసారి ఈ రోడ్డు బుదరమయంగా మారుతోంది. బైకుల మీద వెళ్తుంటే స్కిడ్​ అయి యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. బీటీ రోడ్డు వేయాలని గిరిజనులు కోరుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు.