ఇరిగేషన్‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ : మంత్రి ఉత్తమ్​

ఇరిగేషన్‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ  : మంత్రి ఉత్తమ్​
  • ఈ ఏడాది కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగు నీళ్లిస్తం: మంత్రి ఉత్తమ్​
  • దేవాదుల పనులన్నీ రెండేండ్లలో పూర్తి చేస్తం
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును అందుబాటులోకి తెస్తామని వెల్లడి
  • మంత్రి పొంగులేటితో కలిసి దేవన్నపేట పంప్‌‌‌‌ హౌస్‌‌‌‌ పరిశీలన

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు :ఇరిగేషన్‌‌‌‌ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్‌‌‌‌ ప్రయార్టీ ఇస్తున్నదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది 5 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చే ప్లాన్‌‌‌‌తో ముందుకుపోతున్నామని, రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌ పనులను పూర్తి చేసి.. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులు, భద్రకాళి చెరువు పూడికతీత, వరద నివారణ పనులు, వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై శనివారం ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డితో కలిసి హనుమకొండలో ఉత్తమ్ కుమార్​రెడ్డి రివ్యూ నిర్వహించారు. 

ముందుగా దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా హసన్‌‌‌‌పర్తి మండలం దేవన్నపేట సమీపంలో నిర్మించిన పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ను పరిశీలించారు. తర్వాత ధర్మసాగర్‌‌‌‌ వద్ద టన్నెల్‌‌‌‌ రిపేర్‌‌‌‌ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లా ప్రజాప్రతినిధలు, ఆఫీసర్లతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఇరిగేషన్‌‌‌‌ శాఖపై రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. కొత్త ఆయకట్టు సృష్టించడంలో మాత్రం విఫలం అయ్యారని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌కు తమ ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వడంతో పాటు భూసేకరణ, ఇతర సమస్యలను పరిష్కరించి, మిగతా పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకు పోతున్నదని చెప్పారు. 

ప్రస్తుతం రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారని, ప్రాజెక్టును పూర్తి చేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌‌‌‌లో రూ. 23 వేల కోట్లు కేటాయించామని, అందులో సగం నిధులు గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీలకే వెళ్తున్నదని తెలిపారు. దేవాదుల ద్వారా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీకి గతంలో గోదావరి వాటర్‌‌‌‌ అలొకేషన్‌‌‌‌ లేదని, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌వోసీ కూడా లేదని తెలిపారు. తమ​ప్రభుత్వం వచ్చాక పలుమార్లు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సీఎం, ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లతో పాటు కేంద్రంతో మాట్లాడి సమ్మక్క సారక్క బ్యారేజీ కింద తెలంగాణకు 44 టీఎంసీలు దక్కేలా కృషి చేస్తున్నామన్నారు. సీతమ్మ సాగర్‌‌‌‌ బ్యారేజీకి 67 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.

ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి

తెలంగాణలో ఏటా 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని, అందులో రాష్ట్రం వినియోగించేది 60 లక్షల టన్నులు మాత్రమేనని మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నందున.. ఫిలిప్పీన్స్‌‌‌‌కు 8 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో 80 నుంచి 84 శాతం మంది జనాభాకు కడుపునిండా అన్నం పెడుతున్నామని చెప్పారు.  గతంలో ఏడాదికి రూ.10,600 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యాన్ని ఇచ్చేదని, అందులో 80 నుంచి 90 శాతం బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌కు వెళ్లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుని 3.10 కోట్ల మందికి ఏటా 30 లక్షల టన్నుల సన్న బియ్యం ఇస్తున్నదని, ఎంత ఖర్చయినా పేదలకు ఉచితంగా కడుపునిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. 

పెండింగ్‌‌‌‌ ప్రాజెక్టులపై ఫోకస్‌‌‌‌ : మంత్రి పొంగులేటి 

రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులను తుది దశకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇరిగేషన్‌‌‌‌  ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సాగు, తాగునీటిని అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, కానీ దశాబ్దాలు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు. వాటన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రకాళి చెరువు పూడికతీత, వరద నివారణ పనులపై పర్యవేక్షించి, ఎండాకాలంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ములుగు జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న సాగునీటి కాల్వల పనులు పూర్తిచేయాలని మంత్రి సీతక్క కోరారు. వాగులు ఉన్నచోట చెక్‌‌‌‌డ్యాంలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో  ప్రభుత్వ విప్​రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, కేఆర్‌‌‌‌. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీనాయక్, నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌‌‌‌ జీవన్‌‌‌‌ పాటిల్‌‌‌‌, సివిల్ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌. చౌహాన్, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.