మన వర్సిటీలు వరల్డ్ నాలెడ్జ్ సెంటర్లు కావాలి

మన వర్సిటీలు వరల్డ్ నాలెడ్జ్ సెంటర్లు కావాలి

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమౌతుంది’ ఇదే భారతదేశం నమ్మి ఆచరించిన సిద్ధాంతం.   ఆగస్టు 25న ఎన్నో ఏళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగించిన తెలంగాణ మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి  నిలిచారు.   విద్యకోసం నిధులను ఎంత కష్టమైనా సర్దుబాటు చేసి,  విద్యను అందించే విద్యాలయాల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని  ప్రభుత్వాధినేతగా ఆయన చెప్పిన మాటలు ఉస్మానియా యూనివర్సిటీకి భరోసా కల్పించాయి.  కేవలం ఏడాది బడ్జెట్​లోనే రూ. 40వేల కోట్లకు మించి విద్యకు కేటాయించడమే కాకుండా,  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్,  పోలీస్ స్కూల్స్,  స్కిల్ యూనివర్సిటీ,   రెండు నెలలలోపే ఏకంగా 11వేలకు పైగా టీచర్ల రిక్రూట్​మెంట్​ జరిగింది. విద్యపై  సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితమైన విజన్ ఉందనిపించింది.

మ  నిషి  తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి, కేవలం డిగ్రీ హోల్డర్లను చేయడం కాదు వారిని రాష్ట్రానికి తరగని మేధో సంపత్తిగా చేయాలన్న సీఎం కమిట్​మెంట్​ఆహ్వానించదగ్గది. నిజంగా అందుకు స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు బాగా  తోడ్పడే  అవకాశాలున్నాయి.  

తెలంగాణకు పర్యాయపదం ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు పర్యాయ పదమని ప్రారంభించిన ఉపన్యాసంతోనే సీఎం రేవంత్ రెడ్డి  ఓయూ ప్రతిష్ట ఎంతటిదో ఒక్క వాక్యంలోనే అందరికీ అర్థమయ్యేలా చేశారు. 1917లో  నిజాం తెలంగాణ విద్యావ్యవస్థకు  దేదీప్యమాన భవిష్యత్తును కాంక్షిస్తూ ప్రారంభించిన యూనివర్సిటీ నాటి లక్ష్యాలను వివరించారు. సీఎం చెప్పినట్లు.. దేశాన్ని అర్థిక సరళీకరణ మంత్రంతో ప్రపంచంతో  పోటీపడేలా తీర్చిదిద్ది నేడు మూడో అతిపెద్ద ఎకానమీగా మారడంలో బలమైన పునాది వేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సహా, దక్షిణ భారతంలోనే తొలి ఉత్తమ పార్లమెంటేరియన్  జైపాల్ రెడ్డి వంటి మహనీయులు ఓయూ నుంచే వచ్చారు. 

విద్యలో రాజకీయాలు ఉండవు అనే సూత్రాన్ని స్వయంగా సీఎం వివరించారు.  పార్టీలకతీతంగా జార్జిరెడ్డి,  గద్దరన్న వంటి ఓయూ పూర్వ విద్యార్థుల్ని స్మరించుకున్నారు. ఉస్మానియా ఘనవైభవానికి, నిజ చేతనకు మచ్చుకగా స్థాపించిన నిజాం నిరంకుశత్వాన్ని సైతం 1935లో  పీవీ హయాం నాటికే ధిక్కరించిన వైనం ఉంది.  అదే వేదికపై ఉన్న సీపీ సీవీ ఆనంద్ సహా ఎంతోమంది ఆలిండియా సర్వీస్ అధికారులు,  ఇంజినీర్లు,  డాక్టర్లతోపాటు రాష్ట్రాన్ని సాధించుకున్న గొప్ప ఉద్యమకారుల్ని సైతం ఓయూ  అందించినవారే.

ఉద్యమానికి ఊపిరి

మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా  ఓయూ నిలిచింది.  ఉస్మానియా యూనివర్సిటీ  ఎందరో నాయకులను అందించింది. రాజకీయ పార్టీల సొంత ఎజెండాలు,   నాడు  స్వరాష్ట్ర సాధన కోసం వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన, దాని అనంతరం ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ జేఏసీ ఏర్పాటు వరకు ఓయూ పాత్రను స్మరించుకున్న తీరు  ప్రతి ఒక్కరినీ మరోసారి నాటి రోజులకు  తీసుకెళ్లింది.  కేవలం విద్య, పోరాటాల వేదికగానే కాకుండా యావత్ తెలంగాణకు ఓయూ గుండెకాయ.  తెలంగాణలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానిపై జరిగే తొలి చర్చావేదిక ఉస్మానియా యూనివర్సిటే అవుతుందని, అది అలాగే ఉండాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎంత స్పష్టమైన అవగాహన ఉందో తెలిసింది. 

విద్యార్థుల్లో జోష్​

గత  పదేండ్లలో  ప్రశ్నించే గొంతుక, తమని ఎదురించే శక్తి ఉండకూడదనే లక్ష్యంతో సిబ్బందని భర్తీ చేయక, వీసీలను నియమించక, యూనివర్సిటీలను కుంటుపడేలా చేసి,  మళ్లీ గొర్లు,  బర్లు కాసే దిశగా సమాజాన్ని తీసుకెళ్లడానికి చేసిన కుట్రల్ని బట్టబయలు చేశారు.  ప్రశ్నించే విద్యార్థులే సమాజానికి చోదక శక్తులౌతారని, తమను అణచేసేవారెవరు, తమ గొంతు వినేవారెవరో... తెలుసుకునే విచక్షణను విద్యార్థులు ఎప్పుడూ వదలొద్దని సూచించారు.  అందువల్ల విద్యార్థుల చైతన్యాన్ని సొంత ప్రయోజనాల కోసం ఎవరూ వాడుకోలేరనే సత్యం వెలుగు చూస్తుంది.  

గత పాలకులు అవివేకంతో  దోపిడీతో వట్టిపోయిన ఖజానాకు జవసత్వాలు అందించడం సులభం కాదు. అయినా, సీఎం రేవంత్​ ఆ భరోసా ఇచ్చారు. స్వయం పాలన కోసం గొంతెత్తిన యూనివర్సిటీలోనే గత పదేళ్లలో నిర్బంధాలు అమలయ్యాయి.  వచ్చే డిసెంబర్లో మళ్లీ యూనివర్సిటీకి వస్తానని,  ఈసారి ఏ పోలీసు పహారా లేకుండా న్యాయబద్ధ నిరసనల్ని సైతం వింటానని తేల్చి చెప్పారు.  అలాగే, అదే సమయంలో యూనివర్సిటీకి కావాల్సిన ప్రతీది అందిస్తానని అందుకోసం ఖర్చుకు భయపడకుండా ప్రణాళికల్ని రూపొందించుకోవాలని చెప్పడం విద్యార్థుల్లో జోష్​ను నింపింది. 

వరల్డ్ నాలెడ్జ్ సెంటర్​గా..

విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులతోపాటు ముఖ్యమంత్రి  సైతం విధిగా అందుబాటులో ఉండాలి.  నిజానికి  ఈ విషయం  గతంలో సాధ్యపడలేదు, సీఎంగా  బాధ్యతలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి ఇప్పటికే అంబేద్కర్ యూనివర్సిటీలో పర్యటించారు.  ఇప్పుడు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని గమనించారు.  మరోసారి వస్తానని మాటిచ్చారు.  దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను  సీఎం సందర్శించాలి. తద్వారా అక్కడి ప్రమాణాలు మరింతగా మెరుగుపడతాయి. ఇది కేవలం ఉన్నత విద్యలో  నాణ్యతను పెంచడమే కాదు,  సీఎం రేవంత్​  అన్నట్టుగా యావత్ తెలంగాణ సమాజానికి మేధో విజ్ణాన భాండాగారాన్ని సృష్టిస్తుంది. 18 నుంచి 35 ఏళ్ల యువత 70శాతం ఉన్న మన తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో వరల్డ్ నాలెడ్జ్ సెంటర్​గా రూపాంతరం చెందేలా సీఎం కృషి చేయాలని ఆశిద్దాం.

బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిసాట్ నెట్​వర్క్