దశాబ్దిలోకి తెలంగాణ.. యూనివర్సిటీలపై ఇంత నిర్లక్ష్యమా.. ఈ దుస్థితికి కారణం ఎవరు?

దశాబ్దిలోకి తెలంగాణ.. యూనివర్సిటీలపై ఇంత నిర్లక్ష్యమా.. ఈ దుస్థితికి కారణం ఎవరు?

తెలంగాణ యూనివర్సిటీలపై నిర్లక్ష్యపు నీడ పడింది. విద్య వికసించాల్సిన చోట.. రాజకీయం రాజ్యమేలుతున్నది. పాలకుల వివక్ష తొలగనన్ని రోజులు వర్సిటీలకు మంచి రోజులు వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా దివాలా తీసిందని చెప్పడానికి ఇటీవల నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ​ర్యాంకింగ్​ ఫ్రేమ్ వర్క్ ప్రకటించిన ర్యాంకులను చూస్తే అర్థమవుతున్నది. గతంలో కాస్త మెరుగైన స్థానంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ పరిధి ఫార్మసీలు ఇప్పుడు అట్టడుగు స్థానంలోకి వెళ్లిపోయాయి.

వర్సిటీలకు నిధులివ్వకపోవడంతో పరిశోధనలు మరుగున పడ్డాయి. దాదాపు 15 ఏండ్ల నుంచి నియామకాలు లేవు. దీంతో దాదాపు అన్ని వర్సిటీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్ట్-టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఔట్​సోర్సింగ్​ నియామకాల్లో అవకతవకలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ ప్రారంభమై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుండడం విస్మయం కలిగిస్తోంది. కాకతీయ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనలను గాలికొదిలి అక్రమ మార్గంలో అనుబంధ అధ్యాపకుల పేరుతో 16 మందిని నియమించడం సంచలనం రేపింది. 

కాగితాలపైనే కేటాయింపులు

వర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో కోర్సులు రద్దవుతున్నాయి. గతేడాది కాకతీయ వర్సిటీలో ఎంఈడీ కోర్సుకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల బీఈడీకీ అనుమతి రాలేదు. దీంతో కేయూ పరిధి కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోయిన  పరిస్థితి. గెస్ట్​ ప్రొఫెసర్లను నియమించి మళ్లీ కోర్సులను పునరుద్ధరించాల్సి ఉంది. ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచింది. కానీ వర్సిటీల్లో  పెంచలేదు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం.. ఆ విషయంలో వర్సిటీలను మరిచింది. ఇవన్నీ వర్సిటీలపై ప్రభుత్వ వివక్షను చూపుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ లో విద్యకు 10 శాతం కేటాయింపులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 6.57 శాతమే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,001 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఈ సారి రూ.644 కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేసినా అది కాగితాలకే పరిమితమని విద్యావేత్తలు అంటున్నారు. మహిళా, ఫారెస్ట్ వర్సిటీల ఏర్పాటుకు గతేడాది ఆమోదం తెలిపి ఈ ఏడాది బడ్జెట్​లో రూ.100 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటివరకు అడుగు ముందడుగు పడలేదు.

వర్సిటీల్లో రాజకీయమేంది? 

వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకాన్ని రాజకీయం చేస్తున్నదని విమర్శలున్నాయి. అన్ని వర్సిటీలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి.  వర్సిటీల్లో  అక్రమ నియామకాలు జరుగుతున్నా  సర్కారు పెద్దలు చూసీచూడనట్టు ఎందుకు నటిస్తున్నారో అర్థం కావడం లేదు. వర్సిటీల్లో పాలన సజావుగా జరగాలంటే రాజకీయ జోక్యం తొలగిపోవాలి.  వీసీల నియామకాలు న్యాయబద్ధంగా సత్వరమే పూర్తి కావాలి.  

నియామకాల్లో  ఇన్ని కాంట్రవర్సీలా?

కాకతీయ వర్సిటీలో వీసీ పాలనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెసర్​రమేష్ నియామకంలో యూజీసీ నిబంధనలు పాటించలేదని, పదేండ్ల అనుభవం లేని వ్యక్తిని ఎలా నియమించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ నియామకాన్ని రద్దు చేయాలని ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్​ ప్రొఫెసర్​ మనోహర్ రావు, నిజామాబాద్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్​ ప్రిన్సిపాల్ డా.విద్యాసాగర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. తెలంగాణలోని పది వర్సిటీల్లో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వీసీల నియామకాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని గత ఏడాది హైకోర్టులో ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్ రావు ఏకంగా 40 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నియామకంపై హైకోర్టులో కేసు వేశారు. చాలా వరకు ఈ నెల 21న విచారణకు రానున్నాయి.
 ‑ డాక్టర్ మామిడాల ఇస్తారి, అసోసియేట్ ప్రొఫెసర్, అకుట్ జనరల్ సెక్రటరీ