గుడ్ న్యూస్ : ‘ఫైబర్ గ్రిడ్’ కు శ్రీనిధి రుణాలు .. మహిళా సంఘాల మెంబర్లు, వారి కుటుంబ సభ్యులకు లోన్

గుడ్ న్యూస్ : ‘ఫైబర్ గ్రిడ్’ కు శ్రీనిధి రుణాలు .. మహిళా సంఘాల మెంబర్లు, వారి కుటుంబ సభ్యులకు లోన్
  • రూటర్, కేబుల్, ఇతర పరికరాలకు రూ.4 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ 
  • ఒక్కో మెంబర్​కు 300 కనెక్షన్లు ఉండేలా ప్లాన్
  • ప్రతినెలా రీచార్జి కేబుల్ మాదిరిగా వసూలు బాధ్యతలు
  • గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ బాధ్యతలు అప్పగించేందుకు ప్లాన్

హైదరాబాద్, వెలుగు: ఫైబర్  గ్రిడ్ కు శ్రీనిధి సంస్థ ద్వారా రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మహిళా సంఘాల్లోని సభ్యులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫైబర్ గ్రిడ్  నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ‘ఫైబర్​ గ్రిడ్’ బాధ్యతలను అప్పగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఒక్కో సభ్యురాలికి 300 కనెక్షన్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కేబుల్, వైఫై రూటర్​ ఇతర పరికరాల కోసం సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలు యాక్టివ్ గా పనిచేస్తుండటంతో ఫైబర్ గ్రిడ్  బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. 

మహిళా సంఘంలో సభ్యురాలై ఉంటే దరఖాస్తు చేసుకుంటే శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ రుణంతో ఇంటింటికీ కేబుల్, రూటర్, వైఫై బాక్సులు, ఇతర పరికరాలను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబుల్  ఆపరేటర్ల మాదిరిగా మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి (ఆసక్తి ఉన్నవారికి) కేబుల్ కనెక్షన్​ ఇస్తారు. వారి నుంచి నెలనెలా చార్జీలు వసూలు చేస్తారు. అలాగే, రీచార్జి బాధ్యతలను కూడా వారికి అప్పగించనున్నారు. ఒక గ్రామం, లేదా రెండు గ్రామాలు కలిపి 300 యూజర్స్​ ఉండేలా చూస్తున్నారు. దీనిద్వారా ప్రతినెలా ఒక్కో మెంబర్ కు రూ.15 వేల కమీషన్  సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీనిధి నుంచి ఇచ్చే రుణాన్ని 72 నెలల్లో చెల్లించేలా గడువు విధించనున్నారు. 

ఇంటింటికీ ఇంటర్ నెట్ సర్కార్​ లక్ష్యం 

రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్ నెట్  అందించాలన్న​లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతున్నది. 464 మండలాల్లోని 8,778 పంచాయతీల్లో 83.53 లక్షల గృహాల్లో 3.05 కోట్లపైగా  ప్రజలకు అందుబాటు ధరతో  హై– స్పీడ్​ ఇంటర్ నెట్​ అందించాలన్న సంకల్పంతో  ముందుకెళ్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర ప్రజాసేవ సంస్థలకు హై–స్పీడ్​ ఇంటర్ నెట్​ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఫైబర్​ గ్రిడ్​ ద్వారా గృహాలకు 4-,100 ఎంబీపీఎస్, ఆఫీసులకు ఆన్ -డిమాండ్ 20-100 ఎంబీపీఎస్  స్పీడ్ తో కనెక్షన్  అందించనున్నారు. గ్రామం వరకు ఫైబర్  కేబుల్  వేస్తారు. 

ఇంటింటికీ కనెక్షన్  ఇచ్చే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి సంబంధించి విధివిధానాలపై జిల్లా డీఆర్డీఓలకు త్వరలో సర్క్యులర్  జారీ చేయనున్నట్లు తెలిసింది. నెలల వారీగా ఫైబర్  కేబుల్  కనెక్షన్  తీసుకున్నవారు ఎంత చెల్లించాలో సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజలు ఫైబర్​ గ్రిడ్​ కనెక్షన్​ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారో లేరో ఫీడ్​బ్యాక్​ తీసుకున్నారు. ఒక్కో ఇంటికి కనెక్షన్  ఇస్తే పరికరాలకు ఎంత ఖర్చు వస్తుందో అంచనా వేశారు. ఫైబర్ గ్రిడ్ తో మారుమూల గ్రామాలకూ హై–స్పీడ్​ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

మహిళా సంఘాలకు కనెక్షన్ బాధ్యతలు

గ్రామాల్లోని ఇళ్లకు కేబుల్​ కనెక్షన్ ఇచ్చేలా మహిళా సంఘాలకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. వారికి గ్రిడ్  పరికరాల కోసం రూ.5 లక్షల వరకు రుణం ఇస్తాం. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల్లోనిసభ్యులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆసక్తి ఉంటే శ్రీనిధి ద్వారా రుణం ఇస్తాం. వారి నుంచి నెలవారీగా రుణం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. 72 నెలల గడువుతో రుణం చెల్లించేలా ప్రణాళిక రూపొందించాం.     

 శ్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి