కృష్ణా నీళ్లు, కరెంట్​ ఉత్పత్తిలో తెలంగాణ తీరు సరికాదు : ఏపీ సీఎం జగన్

కృష్ణా నీళ్లు, కరెంట్​ ఉత్పత్తిలో తెలంగాణ తీరు సరికాదు : ఏపీ సీఎం జగన్
  • కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు ఏపీ సీఎం జగన్​ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆంధప్రదేశ్​ సీఎం జగన్  ఫిర్యాదు చేశారు. ఏపీ జెక్కో కు తెలంగాణ కరెంటు సంస్థల నుంచి రావాల్సిన రూ. 6,886 కోట్ల బకాయిలు ఇప్పించడంలో సహకరించాలని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్  భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో..  ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న పలు సమస్యలు, నిధుల పంపిణీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, విభజన హామీలపై చర్చించారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నదని జగన్​ కంప్లైంట్ చేశారు. ఈ విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లారు. 

ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే పాలమూరు-–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (3 టీఎంసీలు), డిండి పథకాలను నిర్మిస్తున్నదని ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఏపీ సర్కార్ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. విభజన చట్టం –2014 లోని హామీలను నెరవేర్చడంలో కేంద్ర హోంశాఖ నోడల్ ఆఫీసుగా ఉందని, అందువల్ల విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ యూ) ఏర్పాటు చేయాలని అమిత్​ షాను జగన్​ కోరారు. అనంతరం రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన ఏపీకి వెళ్లారు.