వడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి

వడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి
  • కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. యాసంగిలో ఎంత పంట కొంటరో చెప్పమంటే చెప్పకుండా కేంద్రం రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బీజేపీ రైతు, దళిత ద్రోహి పార్టీ అని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లపై పార్లమెంట్​లో రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.  సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలను రెండు నెలలుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానిస్తున్నారని.. రైతుల కోసం అవన్నీ సహిస్తున్నామని చెప్పారు.

కేంద్రం వడ్లు కొనదని, యాసంగిలో వరి వేయొద్దని పీయూష్ గోయల్ చెబుతుంటే... వరి వేయాలంటూ రైతులను రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వరి వేయాలంటున్న బండి సంజయ్ నీచ నికృష్ట అపరిచితుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్​ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. బీజేపీ రైతులతో రాజకీయం చేస్తోందని, రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ మనుగడ సాధించలేదన్నారు. ఈ మీటింగ్‌లో పసునూరి దయాకర్, మాలోతు కవిత, రాములు తదితరులు పాల్గొన్నారు. 
మేం బీజేపీకి వ్యతిరేకం: కేశవరావు  
తామెప్పుడూ బీజేపీకి వ్యతిరేకమేనని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు అన్నారు. ఆయన పార్లమెంట్ లో మీడియాతో మాట్లాడారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మాత్రమే తాము మద్దతు ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ గతంలో విపక్షాల సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు వచ్చారని తెలిపారు. అన్యాయంగా 12 మందిని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారని.. దీనిపై అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వడ్ల కొనుగోళ్ల పై లోక్ సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చామని.. వాటిని తిరస్కరించడంతోనే ఆందోళన చేశామన్నారు.