తెల్లాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

తెల్లాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రామచంద్రాపురం, వెలుగు:  సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను శుక్రవారం అధికారులు నేలమట్టం చేశారు. తెల్లాపూర్​ నుంచి ఉస్మాన్​నగర్​ వరకు రేడియన్​ రోడ్డు పక్కన నిర్మించిన పలు షెడ్లను జేసీబీలతో మున్సిపల్​ అధికారులు కూల్చివేశారు. కమీషనర్​ అజయ్ కుమార్​ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాఠించకుండా నిర్మించిన దాదాపు 10 వ్యాపార షెడ్లను తొలగించారు.. తమ పట్టా భూముల్లో నిర్మించిన వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని వాగ్వాదానికి దిగారు. 

రోడ్డుపై రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేస్తున్న వారిని అక్కడి నుండి పంపించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయమై కమిషనర్​ అజయ్​ కుమార్​ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు, పరిమితులు పాఠించకుండా ఇష్టానుసారం కమర్షియల్​ నిర్మాణాలు చేస్తున్నారని అలాంటి వాటిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

పట్టా భూములైనా అనుమతులు లేకుండా కమర్షియల్​ నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఇప్పటికే దాదాపు 20 అక్రమ నిర్మాణాలను గుర్తించామని త్వరలోనే అన్నింటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్మిషన్లు తీసుకొని, రూల్స్​ ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని ఆయన సూచించారు.