కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ వార్నింగ్.. హౌస్ లో ఉండాలంటే ఆడాల్సిందే!

కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్   వార్నింగ్.. హౌస్ లో ఉండాలంటే ఆడాల్సిందే!

నిన్నంతా ఆకలితో అలమటించిన హౌస్‌మేట్స్.. ఓ రెండు ఆటలు ఆడి ఎలాగో కడుపు నింపుకున్నారు. కానీ ఉదయం లేచాక మళ్లీ ఆకలి మొదలు. మరి బిగ్‌బాస్ మనసు ఇప్పటికైనా కరుగుతుందా? వారికి కావాలసినంత ఫుడ్ పెడతాడా? 

ప్రమాణంతో ప్రయాణం

బిగ్‌బాస్‌ కోపం చల్లారలేదు. తన ఆగ్రహాన్ని మరో రకంగానూ చూపించాడు. రోజూ హౌస్‌మేట్స్ ను మంచి పాటతో నిద్ర లేపుతాడు. కానీ ఇవాళ కుక్కల అరుపులతో లేపాడు. ఒక్కసారిగా కుక్కలు అరిచేసరికి అందరూ ఉలిక్కిపడి లేచారు. శ్రీసత్య అయితే పాట వేయొచ్చు కదా అంటూ ముఖం అదోలా పెట్టింది. ఆ తర్వాత అందరూ ఆకలి, ఆకలి అంటూ గొడవ చేశారు. దాంతో బిగ్‌బాస్‌ ఓ మెట్టు దిగాడు. చేసిన తప్పును ఒప్పుకుని.. ఇకపై బాగా ఆడతామని ప్రమాణం చేస్తేనే బిగ్‌బాస్‌ హౌస్‌లో మీ ప్రయాణం ముందుకెళ్తుందని చెప్పాడు. దాంతో అందరూ ఎవరి స్టైల్లో వాళ్లు ఆట అదరగొట్టేస్తామంటూ ప్రామిస్ చేశారు. దాంతో వాళ్లకి ఫుడ్ పంపించాడు. ఆ తర్వాత అందరూ కలిసి శ్రీహాన్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేశారు. అందరి కంటే ఎక్కువ ఇనయా హడావుడి చేయడం విశేషం. అతని పేరు చెబితేనే చిటపటలాడే ఆమె.. అందరి కంటే నువ్వే బెస్ట్ అంటూ నిన్న అతనికి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇవాళేమో ముసిముసి నవ్వులు రువ్వింది. అందరినీ వదిలేసి ఇనయా గెటప్పే బాగుందని కామెంట్ చేయడంపై అందరూ శ్రీహాన్‌ని ఏడిపించడం స్టార్ట్ చేశారు. దాంతో ఇనయా తెగ సిగ్గు పడిపోయింది. పైగా కేక్‌ మీద శ్రీహాన్ అని కాకుండా చోటూ అని రాయమంది. హార్ట్ సింబల్ కూడా వేయమంది. ఇదంతా చూస్తుంటే రూటు మార్చినట్టు కనిపిస్తోంది. 

ఉండాలంటే ఆడాల్సిందే!

ముందురోజు ఫుడ్డు కోసం టాస్క్ ఆడారు. ఇవాళ మీరు ఇంట్లో ఉండటానికి ఆట ఆడాలి అని చెప్పిన బిగ్‌బాస్.. టాస్క్ ముగిసే సమయానికి ఒకరు నేరుగా నామినేట్ అవ్వాల్సి ఉంటుందనే కండిషన్ పెట్టాడు. బొమ్మలు, పూలతో ఒక ఆట ఆడమన్నాడు. అందరినీ రెండు టీములుగా విభజించాడు. ఓ టీమ్‌కి ఇనయాని, మరో టీమ్‌కి శ్రీసత్యని లీడర్స్ గా పెట్టాడు. కన్వేయర్ బెల్ట్ మీది నుంచి బొమ్మలు, పువ్వులు వస్తుంటాయి. వాటిని చేజిక్కించుకుని ఎవరి బుట్టల్లో వాళ్లు పెట్టుకోవాలి. ఇలా మొత్తం మూడు రౌండ్స్ ఆడాలి. ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే విజేత. రెండు టీములూ ఆవేశంగా బరిలోకి దిగాయి. పోటీపడి పూలు, బొమ్మలు లాక్కోవడం మొదలుపెట్టాయి. 

రేవంత్ కేకలు.. శ్రీసత్య సాకులు

టాస్కులు ఆడేటప్పుడు ఎక్కడలేని అగ్రెషన్ వచ్చేస్తుంది రేవంత్‌కి. పులి వేటాడ్డానికి దూకినట్టు దూకుతుంటాడు. ఆ ఆవేశంలో ఏదేదో అంటుంటాడు. ఏవేవో చేస్తుంటాడు. ఇవాళ కూడా అంతే. వెళ్లి కన్వేయర్ బెల్డ్ దగ్గర కాసేసాడు. అందరూ గుమిగూడారు కానీ రేవంత్‌ మాత్రం ఎలాగైనా ఎక్కువ బొమ్మలు లాగేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘ఫైమా.. ఎవరైనా అడ్డొస్తే తోసి పారదొబ్బు’ అని రెండుమూడుసార్లు అన్నాడు. దాంతో శ్రీసత్యకి కోపమొచ్చేసింది. సరిగ్గా మాట్లాడు, అలా అంటావేంటి, ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ గొడవకు దిగింది. అతను రివర్స్ అయ్యాడు. ఇద్దరూ వాదులాడుకున్నాడు. ఇక అక్కడి నుంచి గొడవ జరుగుతూనే ఉంది ఇద్దరికీ. రేవంత్ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటూ శ్రీసత్య గొడవ చేస్తూనే ఉంది. రేవంత్ కూడా కుదురుగా ఉండకుండా రఫ్‌గా గేమ్ ఆడసాగాడు. అతను తన కాళ్లమీద కొట్టాడు అంటూ అర్జున్ కంప్లయింట్ చేయడంతో ఆ పాయింట్ పట్టుకుంది సత్య. ఆ తర్వాత అతను మైక్ సరిగ్గా వేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పడంతో ఆ పాయింట్ మీద కామెంట్ చేసింది. మొత్తానికి అతను కేకలు పెడుతూనే ఉన్నాడు. ఈమె సాకులు చెబుతూనే ఉంది. వీళ్ల పంచాయతీ వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున దగ్గరే ముగుస్తుంది. 

ఆడటమంటే అరవడమా?

బిగ్‌బాస్‌ ఎప్పుడైతే కోప్పడ్డాడో అందరూ తెగ ఫీలైపోయారు. మెరీనా కూడా నేనిక ఆడి చూపిస్తా, టాస్క్ ఉన్నా లేకపోయినా బోలెడంత కంటెంట్ ఇస్తా అంటూ చాలెంజ్ చేసింది. ఆటలో కూడా హుషారుగా పాల్గొంది. అయితే బొమ్మలు లాక్కోవడం, లాక్కున్నవి దాచుకోవడం ఆట. కానీ ఆమె ఆడినదానికంటే అరిచిందే ఎక్కువ. వాసంతి కూడా అంతే. లోపలికి చేయి పెట్టి బొమ్మలు తీయొద్దు అని చెబుతున్నా వినకుండా అదే చేసింది. దాంతో మొదటే విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత ఇక గొడవ పడటమే సరిపోయింది. అస్తమానం ఏదో ఒక వంక పెడుతోంది. వాళ్లు ఇలా చేశారు, వీళ్లు అలా చేశారు అంటూ అరుస్తోంది. అడ్డుగా ఉంటున్నారు అంటూ పేచీ పెడుతుంటే అదే కదా వాసంతీ ఆట అని గీతూ కౌంటర్ వేసింది. పైగా ఆదిరెడ్డి చెయ్యి ఆటలో పొరపాటున తగిలితే ఈమె కావాలని కొట్టడానికి రెడీ అయిపోయింది. ఇక కీర్తి కూడా చాలా కేకలు పెట్టింది. ఫైమా కూడా తక్కువ తినలేదు. నోటికి బాగానే పని చెప్పింది. అయితే టాస్క్ ఆడటంలో ఆమె కాంప్రమైజ్ అవ్వదు. కాబట్టి ఎవరితో ఎంత గొడవ పడినా ఆట మాత్రం ఆపలేదు. ఇంట్లో చాలామందికి అర్థం కానిదేంటంటే ఆటాడటమంటే గొడవలు పడటం కాదు. తెలివి ఉపయోగించడం. స్ట్రాటజీలు వేయడం. అది మానేసి ఒకరిపై ఒకరు అరచుకోవడం, పట్టి లాక్కోవడం చేస్తున్నారు. ఫిజికల్ కూడా అయిపోతున్నారు. వీళ్లు ఎప్పటికి మారతారో ఏమో!

మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ అంతా ఈ ఆట చుట్టూనే తిరిగింది. మొదటి రౌండ్‌ ముగిసింది. రేపు మిగతా రౌండ్స్‌ ఆడాల్సి ఉంటుంది. ఇవాళే తెగ పోట్లాడుకున్న హౌస్‌మేట్స్ రేపు ఇంకెంత రచ్చ చేస్తారో చూడాల్సిందే.