మా మధ్య ఎలాంటి గొడవలు లేవు

మా మధ్య ఎలాంటి గొడవలు లేవు

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ తో కలిసి అన్నీ సమస్యలపై చర్చిస్తున్నామని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇవాళ ఫిలిం ఛాంబర్ ఆఫీసులో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, దామోదరప్రసాద్, మోహన్ వడ్లపట్ల హాజరైయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. "తెలుగు సినిమా నిర్మాతలు మేము షూటింగ్స్ ను అపాము. మేము 4 పాయింట్స్ పై చర్చిస్తున్నాము. సినిమా ఓటీటీకి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అని ఈ విషయంలో ఒక కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించి వర్క్ చేస్తుంది. రెండవది... థియేటర్స్ లో విపిఎఫ్ ఛార్జీలు, పర్సెంటెంజ్ లు ఎలా వుండాలి అనేదానిపై ఒక కమిటీ వేశాము. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుంది. మూడవది.. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్ పై కూడా కమిటీ వేశాము. నాలుగవది.. నిర్మాతలకు ప్రొడక్షన్ లో వెస్టేజ్, వర్కింగ్ కండిషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలి అంటే ఏమి చెయ్యాలి.. దీనికి కూడా కమిటీ వేశాము.

ఈ నాలుగు పాయింట్స్ మీద ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీలు వేశాము అవి వర్క్ చేస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా అందరికీ ఫిలిం ఛాంబర్ నిర్ణయమే ఫైనల్.  మేము నెలలు తరబడి షూటింగ్స్ ఆపాలని ఉద్దేశ్యం లేదు. నిర్మాతకు భారం కాకూడదు. లాస్ట్ మూడు రోజుల నుంచి మూడు నాలుగు మీటింగ్స్ అయ్యాయి. ఈ నాలుగు కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా వుండాలి అనేదానిపై వర్క్ చేస్తున్నాము. త్వరలో ఆ రిజల్ట్ వస్తుంది. నిర్మాతలంతా కలిసి నాపై ఎక్కువ బాధ్యతలు పెట్టారు. నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తులపై కాదు సినిమా బాగుండాలని రాయండి" అని తెలిపారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "నిర్మాతల కష్టాలను పరిష్కరించుకునేందుకు నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశాం. నిర్మాతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదైనా అందరి లక్ష్యం ఒకటే. దిల్ రాజు తన సమయాన్ని పూర్తి స్థాయిలో సినిమా కోసం వెచ్చిస్తున్నారు. దిల్ రాజును కార్నర్ చేసి మాట్లాడటం సరికాదు" అన్నారు.