
టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సంబంధించి విధి–విధానాలను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తాజాగా ఖరారు చేసింది. నాలుగు కోట్ల రూపాయలతో తీసే సినిమాను చిన్న సినిమాగా పరిగణించనున్నట్లు మండలి స్పష్టం చేసింది. ఆ బడ్జెట్ లోపు సినిమాలను పూర్తి చేసే నిర్మాతలు సినీ కార్మికులకు 15 శాతం మాత్రమే వేతనాలు చెల్లించవచ్చని సూచించింది. అంతకంటే బడ్జెట్ ఎక్కువైతే పెద్ద సినిమాగా పరిగణిస్తామని పేర్కొంది.
ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో కలిసి ఇవాళ విధి, విధానాలు ఖరారు చేసింది. ఫిల్మ్ చాంబర్ తయారు చేసిన ఫార్మెట్ లో సినిమా బడ్డెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకాలు, సినిమా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు తదితర వివరాలను నమోదు చేసి షూటింగ్ ప్రారంభించే 15 రోజుల ముందు ఫిల్మ్ చాంబర్ కు ధరఖాస్తు చేసుకోవాలని చిన్న నిర్మాతలకు సూచించింది.
ఆ దరఖాస్తును ఛాంబర్ నుంచి 10 మంది, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి 10 మంది సభ్యులతో కూడిన కమిటి పరిశీలించి చిన్న సినిమాగా పరిగణించడంతోపాటు 15 శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించనున్నట్లు ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు. దీంతో పాటు ఫిల్మ్ చాంబర్ కు ఇచ్చిన బడ్జెట్ పరిధి దాటి ఎక్కువ ఖర్చైతే ఆ బాధ్యత దర్శకుడే వహించాలనే నిబంధనను విధించింది. ఈ మేరకు కమిటీ ప్రతి నెల రెండో, నాలుగో మంగళవారాల్లో సమావేశమై చిన్న నిర్మాతల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆమోదించనున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది.