రైతన్నల పాలిట శాపం..పిడుగులతో కూడిన వర్షాలు... ఐఎండీ హెచ్చరికలు 

రైతన్నల పాలిట శాపం..పిడుగులతో కూడిన వర్షాలు... ఐఎండీ హెచ్చరికలు 

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి. మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో ...  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో...

తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు , తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.  భారీ వర్షాల కారణంగా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి కారణంగా మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్​ లో...

సోమవారం (మే1)న కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం ( మే2) న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వర్షాలు కురిశాయి.

శ్రీశైలంలో గంట పాటు దంచికొట్టిన వర్షం పాటు ప్రధాన వీధులన్నీ జలమయం

శ్రీశైలం మండలంలో గంట పాటు వర్షం దంచికొట్టింది కుంభ వర్షం కురిసింది శ్రీశైలం,సున్నిపెంటలలో ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసింది వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన విధులన్ని జలమయమయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్​ 30)  ఉదయం నుండి ఎండ ఉక్కపోతగా ఉన్న మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది.వర్షం కారణంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు.  మరోపక్క శ్రీశైలంలో శ్రీగిరి కాలనీ కొత్తపేటలో బురద ఎర్రమట్టి నీళ్లు దిగువకు కొట్టుకొస్తున్నాయి.  భారీ వర్షం ధాటికి స్థానికులు,దుకాణదారుల దుకాణాల వద్దే నిలిచిపోయారు ఏకధాటిగా గంటపాటు కురిసిన భారీ వర్షం ధాటికి విరిగి పడ్డ గానుగ చెట్టు నెలకొరిగింది క్షేత్రపరిధిలోని ఉమారామలింగేశ్వర దేవంగా సత్రం రోడ్డులో వెళ్తున్న కారుపై ఒక్కసారి గానుగ చెట్టు విరిగి కారుపై పడింది.అయితే కారులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు విరిగిపడ్డ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండటంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అక్కడే ఉన్న భక్తులు చెట్టును పక్కకు జరపడంతో కారు బయటకు తీశారు.