కథ : మట్టి దిబ్బ

కథ : మట్టి దిబ్బ

‘‘జాగ్రత్త” ఎవరూ లోపలికితొంగిచూడొద్దు. సరేనా... దూరం నుంచి చూసి వెంటనే రావాలి. టీచర్స్ ఇన్​స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి”అంటూ టూర్ ఇంచార్జి సార్ పిల్లలతో చెప్పాడు.

ఎప్పటినుంచో పిల్లలు అడుగుతున్నారని స్కూలునుండి విహారయాత్రకు వెళ్లాలని డిసైడ్​ అయ్యారు. టూర్​లో భాగంగా ప్రాజెక్టు సందర్శించాలని సోషల్ సార్ ప్రపోజ్ చేశాడు అందరూ ‘ఓకే’ అన్నారు. మూడు రోజుల టూర్​లో ముందుగా ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. నీళ్లంటే ఎవరికైనా ఎక్కడలేని ఉత్సాహం. కాబట్టి సహజంగానే పిల్లలతో పాటు టీచర్లు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు టీచర్లు గ్రూపులు గ్రూపులుగా సెల్ఫీలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు. సాయంత్రం కావటంతో రద్దీ ఎక్కువగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సాగునీరు ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు. కానీ పర్యాటకంగా బాగానే అభివృద్ధి చేశారు .నర్సింహులు సార్ చూపు అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి మీద పడింది. అతన్ని పలకరిద్దామని దగ్గరగా వెళ్లాడు. అతను తదేకంగా ప్రాజెక్టు మధ్యలోకి చూస్తూ దీనంగా నిలబడ్డాడు. అతనికి దగ్గరగా వెళ్ళినా పక్కన ఒక మనిషి వచ్చాడనే ఉనికిని పసిగట్టలేదు.‘‘ఏం అన్నా... ఏమో తదేకంగా చూస్తున్నావ్? ఏమున్నది అక్కడ?” అన్నాడు నర్సింహులు సార్​.  ఆ మాటలకు ఉలిక్కిపడి చూసిన అతని కళ్లనిండా నీళ్లు నిండి కనిపించాయి. ‘‘అరె....కూర్చోండి. ఏ ఊరు మీది? ఏం పేరు? ఒక్కడివే వచ్చావా? ఇంకెవరూ  రాలేదా?” అంటూ ప్రశ్నించాడు. కొంచెం కుదుటపడేలా చేయాలని ఏదో చెప్పబోయాడు. గొంతు పూడుకు పోయింది.

బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసి ‘‘ముందు నీళ్లు తాగు” అని అతనికి ఇచ్చాడు నర్సింహులు సార్​. బాటిల్ పైకెత్తి సగం వరకు తాగి... ఇటువైపు చూసి ‘‘పరవాలేదు’’ అనడంతో పూర్తిగా తాగి షర్ట్ కాలర్​తో మూతి తుడుచుకుంటూ ‘‘నా పేరు దేవేందర్ సార్. మాది మామిడిపల్లి గ్రామం. ఆ ప్రాజెక్టు మధ్యలో మా ఊరు ఉండేది. నాలుగేండ్లకిందైతే ఈ టైంకు బర్లకు మేతవేసి, పాలుపిండుకుని ఇంటిమొకాన పోయేటోన్ని సార్. ఏడాదికి మూడు పంటలు తీస్తూ కళకళలాడిన ఊరు ఇది. ‘‘చెట్టుకొకలం పుట్టకొకలం చెల్లాచెదురైనం.”ఈ ప్రాజెక్టు మా ఊరిని మింగింది. ఇల్లు మునిగింది. మా నాయనను దూరంచేసింది. ప్రతి ఏడాది ఇదే రోజు ఇక్కడికి వచ్చి మా అవ్వ.. మా నాయన కోసం ఎదురుచూసేది. ఆ ఆవేదనతో మంచం పట్టి ఏడాది క్రితం కాలం చేసింది. ఈ ఏడాది మా నాయన జాడ ఏమన్న దొరుకుతదేమో అని నేనొచ్చిన” అంటున్న అతని మాటలు విన్న నర్సింహులు సార్ గుండె చెరువైంది. ‘‘ఇలా కూర్చొని ఏం జరిగిందో వివరంగా చెప్పు” అంటూ రెయిలింగ్ పై కూర్చున్నాడు నర్సింహులు సార్​. మెల్లగా బొంగురుపోతున్న గొంతుతో చెప్పడం ప్రారంభించాడు దేవేందర్.

*   *   *

బోరేమోలే మొగడువోంగ బొంత శింపులకు ఏడ్శిందట నీలాంటిదే ఎనకటికి ఎవతో. వొకదిక్కు కొంపలన్ని మునిగిపోంగా నీ రిబ్బెనకే వచ్చినాదే సుప్పనాతి ఉట్టికి కట్టిన రిబ్బెన ముడివిప్పుతూ... ఏడుపు ఎగేసుకొస్తుంటే మనవరాలు మీదికి ఎగబడ్డది సరోజన. కోడలు భాగ్య వాకిట్లున్నది. వాడకట్లొల్లంత వొకల మీద ఒకలుపడి శోకాలు పెట్టుకొని ఏడుస్తున్నరు. కొడుకు నలుగురైదుగురు పడుచు పోరగాళ్లను పట్టుకొని, బీరువా, మంచాలు, పరుపులు కుర్చీలు బరువైన సామాన్లన్నీ అమాంతం లేవట్టి డీసీఎంలో పెడుతుండ్రు. బోళ్ళు, బాసన్లు ఒక సంచిలో వేసి ముల్లెగడతంది సరోజన.
‘‘అవ్వ ఇంకెంతసేపే. పొద్దటి నుంచి సదిరిందే సదురుతున్నవ్?  అన్ని ఆ సంచిలో కుచ్చు. ఆడికి పోయినంక అన్ని సదురుకుందువు తియ్యి. ఇగ రేపటి నుంచి ఏం పని నీకు బర్రెనా? దుడ్డెనా?’’ అన్నడు దేవేందర్ పూడుకుపోయిన గొంతుతో. కొడుకు దబాయింపుకు ఈ లోకంలోకి వచ్చింది సరోజన.‘‘పన్నెండేడ్ల  పిల్లపుడు లగ్గం చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టిన్నంటే... మల్ల ఇంట్లోంచి బయట కాలు పెట్టలేదు. బిడ్డల పెంపకాలు, పెండ్లిల్లు చేసిన. పురుల్లు పోసిన. సావులు చూసిన. అరవై ఏండ్లల్ల ఆరుసార్లన్న అవ్వగారింటికి పోలేదు బిడ్డా...! ఇల్లు ఇడ్శిపెట్టి” కొంగుతో కండ్లద్దుకుంది సరోజన. దేవేందర్​కు దుఃఖం తన్నుకొచ్చింది. నిజమే పండుగలకు, యాత్రలకు అందరు పోయినా ఇల్లు పట్టుకొనే ఉండేది. ఒకవేళ తప్పనిసరై పోయినా సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వచ్చేది. ఇంటికాడ నిద్ర చేస్తేనే తనకు నిమ్మలంగా ఉండేది.

రేపటి నుంచి ఎంత గుండె పలుగుతదో.. ఏమో..! ఆ ఆలోచనే భయమనిపిస్తుంది. కానీ తప్పదు ఇంకో గంట సేపు అయితే ఇంటికి, ఊరికి, ఈ నేలకి తనకి రుణానుబంధం తీరిపోనుంది. తరతరాలుగా ఆత్మీయతలు పెన వేసుకున్న జనం. ఎవరు ముగ్గువోసిండ్రో, ఎవరు పునాది తవ్విండ్రో, ఎవరు ప్రాజెక్టు పేరు మీద పేగును తెంపేస్తున్నరో??? ప్రశ్నలు...ప్రశ్నలు...దేవేందర్ మనసును మెలిపెడుతుంటే ‘‘అన్నా మా ఓనర్ ఫోన్ చేసి తిడతండే. ఇంకా మూడు ట్రిప్పులు మాట్లాడుకున్నడట. రాత్రి అయితంది. జల్దీ సదురుండ్రే” అన్న డ్రైవర్ షాదుల్లా మాటలతో కళ్ళు తుడుచుకున్నడు దేవేందర్. ‘‘పొద్దున్నుంచి ఒకటే ఏడుపు కండ్లుటాయే! నెత్తివల్గిపోతది. ఏమైతది చచ్చిపోతమా? మనమొక్కలమే వెళ్ళిపోతున్నామే? ఊరు ఊరంతా ఎల్లిపోతున్నరు. ఏది శాశ్వతం?’’ అంటూ భుజం మీద నుంచి తువ్వాల తీసి తల్లి కండ్లు తుడిచిండు దేవేందర్. వాకిట్లో ఉన్న భార్యని పిలిచిండు. భాగ్యవ్వ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అత్తను మెల్లగా తోలుకపోయి అరుగుమీద కూర్చుండబెట్టి... బట్టలన్నీ ఒక సంచిలో వేసి ముల్లెకట్టింది. ఒక్కొక్కటిగా సామాన్లన్ని డిసిఎంలకు ఎక్కుతున్నయి. గోడకు  వేలాడుతున్న పాత ఫొటోలను మొలలతో సహా ఊడబీకిన దేవేందర్ ఇంకేమన్నా మర్చిపోతున్నమా అని మూల మూలనా గాలిచ్చిండు. కడపలోంచి కాలు బయట పెడుతూ తలుపులు మూసి గొళ్ళెం పెడదామనుకున్నడు. ఇంకేం మిగిలిందని దాచుకోవడానికి ఇంటిగుట్టు బయటకు తెలియకూడదనే కదా తలుపులు. బతుకులే బజార్ల పడ్డంక ఇంకా దాపరికం ఏమున్నది? అందుకే గొళ్లెం పెట్టకుండ బండ బారిన మనసుతో డీసీఎం వైపు కదిలాడు. సామాన్లు ఎక్కించి పిల్లలను అవ్వను క్యాబిన్లో కూర్చోబెట్టిండు. భాగ్యవ్వని బండిమీద కూర్చుండ పెట్టుకున్నడు. ‘‘నాయిన మతులావు ఏమన్న తెలిసిందా బిడ్డా?”అన్నది సరోజన. డీసీఎంలోంచి కొడుకుదిక్కు తొంగిచూస్తూ. ‘‘నాయినేమన్న చిన్న పిలగాడాయే.

మా వత్తడు తియ్యి. ఆయనకు మనకంటె ఊరొళ్ళ గురించేనాయె పట్టింపు” అనుకుంట నిద్రలో నడిచిపోతున్న మనిషిలా బండి స్టార్ట్ చేసిండు. షాదుల్లా డిసిఎమ్​ను మెల్లగా కదిలిచ్చిండు. సరోజన మనసు కలుక్కుమంది. భర్త మొగులయ్య యాదికొచ్చిండు. నాలుగేండ్లనుంచి వొకటే తిరుగుడు. ఎక్కడుంటడో? ఏమితింటడో? చెప్పడు. ఎవరెవరినో కలుస్తన్న అంటడు. చూస్తుండగానే ఊరు ఖాళీ అయింది. సాయంత్రం కావస్తుంది అధికారులు వీఆర్ఏల సహకారంతో ఒక్కొక్క ఇల్లు చెక్ చేస్తూ గొళ్ళాలు పెడుతున్నరు. ఊళ్లో ఎవరు లేరని నిర్ధారణకు వచ్చారు అధికారులు. మైక్​లో చివరిసారిగా హెచ్చరిక జారీ చేశారు. ఊరు నిర్మానుష్యమైంది ఎక్కడాచిన్నఅలికిడి లేదని నిర్ధారించుకున్నారు. స్పెషల్ ఆఫీసర్​కు పరిస్థితి వివరించి, తర్వాత చేయాల్సిన పనికి పర్మిషన్​ తీసుకున్నారు. రెండవ దశ ప్రారంభమైంది. అప్పుడు ప్రత్యక్షమయ్యాయి జర్మన్ నుంచి తెప్పించుకున్న హైపవర్ హిటాచీ బండ్లు. ఊరుకు నాలుగు దిక్కుల నుంచి నాలుగు బండ్లు పని మొదలుపెట్టాయి. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా దుమ్ము అల్లుకుంది. పొక్లెయినర్ల చప్పుడు తప్ప మరోశబ్దం వినిపించట్లేదు. కొమ్మల గుబుర్లలో నుంచి పొడవాటి గైకట్టెతో పిట్టగూళ్ళను పడగొడుతున్నట్టు నేలకూలుతున్న ఇండ్లు. అత్యాధునిక ఆయుధాలకు ఎదురు నిలవలేక తలవంచుతున్నసైనికుల్లా ఒక్కొక్క పైకప్పు కుప్పకూలుతోంది. గోడలు మృత్యుదిబ్బలుగా మారాయి. తరాల పురా జ్ఞాపకాలు మట్టిలో కలిసిపోవడానికి పది గంటలు పట్టింది.

ఆ ఊరు ఇకమీదట రికార్డుల్లో మాత్రమే కనబడుతుంది.భౌతికంగా తన అస్తిత్వం తెల్లవారితే నీళ్లలో మునిగిపోనుంది. నాలుగ్గంటలు అన్ని డిపార్ట్​మెంట్ల సమన్వయంతో స్పెషల్ ఆఫీసర్ సూచనలతో సాగిన ఆపరేషన్ సక్సెస్ అయింది. అధికారులు, సిబ్బంది యంత్రాలతో సహా తిరుగు ముఖం పట్టారు. పోతూ పోతూ ఒకటీ అరా మిగిలిపోయిన పశువుల కొట్టాలని కూడా దగ్గరుండి మరీ కూల్చి వేయించాడు కాంట్రాక్టర్. తెల్లవారితే ప్రాజెక్టులోకి నీళ్లు వదిలే కార్యక్రమం ప్రారంభోత్సవం. సక్సెస్​ఫుల్​గా పని పూర్తయిందని తెలిశాక స్పెషల్ ఆఫీసర్ హాయిగాఊపిరి పీల్చుకున్నాడు.

*   *   *

సరిగ్గా ఆరు నెలల క్రితం ఉదయం నుంచే ఊరంతా ఉసికె ఉడికినట్టు ఉడుకుతోంది. ఎవరికి తోచింది వాళ్ళు గుంపులు గుంపులు కూడి మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్ల కంటే ముందే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసిండ్రు. ఊరి జనమంతా కచేరి కాడ జమైండ్రు. ఆ ఊరి ప్రజలను సమన్వయం చేసి ఒప్పించే బాధ్యత ఎంపీపీ ఎల్లంకి అప్పగించారు. వారం ముందు నుంచి ఇల్లిల్లూ తిరిగి రకరకాల వాదనలు విన్నంక ఆఫీసర్లను ఊర్లకు ఆహ్వానించి అభిప్రాయ సేకరణ సభ పెట్టించారు. స్పెషల్ ఆఫీసర్ ఉపన్యాసం మొదలుపెట్టి ఎల్లంను మాట్లాడమని కోరిండు. ‘‘ప్రాజెక్టు అంటే మామూలు ముచ్చట కాదు. వేల కోట్ల రూపాయలతో కూడుకున్నది. మనం ఆపితే ఆగేది కాదు. వాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకునే వస్తరు. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా పనులు మొదలుపెడతరు. మనకు రావాల్సిన పైసలు కోర్టులో జమ చేస్తరు. అందుకే మన సారు మన గురించి బాగా ఆలోచించి బయటకంటే ఎక్కువనే ఇప్పిస్తరట. నాలుగు ఊర్ల జనం త్యాగం జేస్తే వందల ఊర్లు బాగుపడతయి. మన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతయి. పెద్దమనసు చేసుకొని ఆలోచించండి” అంటూ ఎంపీపీ ఎల్లం ప్రసంగిస్తుండు.. అంతలోనే ‘‘నీదేం పోయింది. మస్తుగ చెప్తవ్. నీ ఇల్లు మునుగుతుందా? నీఊరు వోతుందా?”  మాటలు గుంపులోనుంచి గట్టిగ వినపడ్డయి ‘‘ఇప్పుడు మస్తుగ మాట్లాడుతరు. ఇల్లు ఇస్తరు. పద్దెనిమిదేండ్లు దాటినోళ్ళకు ప్యాకేజీ ఇస్తరు. పొద్దుగాల లేస్తే పొక్కలకు పోవుటానికి ఏం పనిజేస్తరు.

ఎవుసాలే పొయినంక, అక్కరెల్లినంక జాడిచ్చి తంతె అడక్కతిని బతుకుదురు తియ్యిండ్రి. ఉన్నది వాళ్ళ చేతులవడ్డంక వాకిలి కూడా తొక్కనీయరు. తర్వాత పరిస్థితి ఎట్లుంటదో ఆలోచన చేయుండ్రి. ఒకింత హెచ్చరిక జారీచేసింది ఆ గొంతు. పత్తి బేళ్ళలో నిప్పురవ్వ పడ్డట్టు ఆరోజు ఎల్లం పెట్టిన చిచ్చు ఇల్లిల్లూ అంటుకొని ఊరంతా ముసురుకుంది. అయ్యా కొడుకుల నడుమ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. కొంతమంది కూర్చొని మాట్లాడుకున్నారు. కొంతమంది పంచాది పెట్టి సెటిల్​ చేసుకున్నరు. కొంతమంది కోర్టుకు ఎక్కిన్రు. అన్ని సక్రమంగా ఉన్నోళ్లు పాసుబుక్కులు అప్పజెప్పి పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టి పైసల కోసం ఎదురుచూస్తున్నరు. కొంతమంది యువకులు నిరసనలు, నిరాహార దీక్షలతో ఆందోళన చేస్తున్నరు. కొందరు రైతులని కూడగట్టిన మొగులయ్య స్టే కోసం న్యాయస్థానం కడప తొక్కిండు.

భయపడుతున్న రోజు రానే వచ్చింది. ఒకవైపు ఈ ఆరునెలల్లో కొందరు బ్రోకర్లు చేతివాటం ప్రదర్శించి రాజకీయ అండ, పలుకుబడి, పరపతితో నయానోభయానో చాలా మందిని ఒప్పించారు. ఒకవైపు ఉద్యమం నడుస్తూనే ఉంది. ఇంకోవైపు పాస్​ పుస్తకాలు అప్పగించి చెక్కులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యమకారుల వెంట నడుస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అనేక ప్రకటనలు. సభలుసమావేశాల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మరోవైపు న్యాయస్థానం ద్వారా మెరుగైన పరిహారం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు మొగులయ్య. రెండు రోజుల క్రితమే స్టే కోసం పట్నం వెళ్లిన మొగులయ్యకు ఇక్కడ ఊరు ఖాళీ చేస్తున్న విషయం అంది ఊరికి ప్రయాణమయ్యాడు.

*   *   *

నాలుగేళ్లు అయింది పనులు జరుగుతూనే ఉన్నాయి. వీళ్లు కొట్లాడతనే ఉన్నారు. వచ్చినోళ్లకు వచ్చినయ్. రానోళ్లకు రానేలేదు. ఆఫీసులచుట్టూ చెప్పులరిగేదాక తిరుగుతనే ఉన్నరు. ముందుగానే చెక్కులు తీసుకున్నవాళ్ళు చుట్టాలని దీంజేసుకుని కొంత జాగా కొనుక్కున్నారు. కొందరు అప్పులు తీర్చుకున్నరు. కొందరు ఆడపిల్లల పెండ్లిల్లు చేస్తే, ఇంకొందరు ఖర్చు పెట్టిన్రు. కానీ మొగులయ్య కుటుంబంది ఇంకొకరకం బాధ. పైసల్లేవు. ప్యాకేజీ లేదు. కోర్టుకుపోయిన మొగులయ్య ముఖం కనబడలేదు. భార్య సరోజన, కొడుకు దేవేందర్ తిరగని చోటులేదు. ఇల్లు మునిగిందని ఏడవాల్నో. మనిషి మాయమైండని ఏడ్వాల్నో తెలుస్తలేదు. ఈ పరిహారం దొరక్కపోతె ఎట్ల బతుకు? ఇంటి పెద్ద దిక్కు దేవేందర్ వంతైంది. ప్రయివేట్ కంపెనీలో దినసరి కూలీలా కుటుంబాన్ని పోషిస్తూ చెక్కుల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

ప్రాజెక్టులు కట్టినప్పుడు అవి ‘‘ఆరం” తీసుకుంటయని మొగులయ్యనూ అట్లే తీసుకున్నదని కొందరు, కాంట్రాక్టర్ దగ్గర ఐదుకోట్లకి అమ్ముడుపోయిండని, కనబడితే కొట్టి సంపుతరని దేశాలు పట్టుకొనిపోయిండని కొందరు, లేదు లేదు వ్యక్తిత్వాన్ని చంపుకుని అమ్ముడుపోయే మనిషికాడు మొగులయ్య నికార్సయిన మనిషని, కాంట్రాక్టర్లు, బ్రోకర్​లే ఏదో చేసి ఉంటారని సన్నిహితులు...  అలా చేస్తే శవమన్నా దొరకాలి కదా అంతా నాటకం అని గిట్టని వాళ్లూ.. తలో రకంగా చెప్పుకుంటున్నారు. 

*   *   *

ఊరు ఖాళీ చేస్తున్నారన్న విషయం తెలిసి మొగులయ్య హుటాహుటిన ఊరికి బయల్దేరాడు. ఊరికి చేరుకునే లోపు మసక చీకటి కమ్ముకుంటుంది. పొలిమేరలోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. రోడ్డుమీద భారీ బందోబస్తు ఉంది. ఈగ చొరబడడానికి వీలుపడని నిఘా. హాలోజన్ బల్బుల వెలుగుల్లో దుమ్ము ఆకాశానికి అంటుతుంది. పొక్లెయినర్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ పరిస్థితుల్లో తను వాళ్ళ కంటపడితే... పరిస్థితి అర్థమైంది. తనేం  చేయలేడు. ఎడ్ల కొట్టంలో దాపెట్టిన విలువైన పత్రాలు, పాసుబుక్కులు ఆయా డిపార్ట్​మెంట్లకు సమర్పించిన అప్పీలు, ఫిర్యాదుల రిసీవ్డ్ కాపీలు అన్నీ అందులో ఉన్నాయి. తెలిసిన పిల్ల బాటగుండా చెట్లను పొదల్ని చాటు చేసుకుంటూ కొట్టం వైపు నడిచి, నిట్టాడుకు వొరిగి కూలబడ్డడు మొగులయ్య. ఆరు నెలలుగా నిద్రాహారాలు మాని చేయని ప్రయత్నం లేదు. ఈ రోజుతో అది దుమ్ము కొట్టుకుపోయింది. నన్నే  నమ్ముకుని వెంట నడిచిన రైతులను కాపాడలేకపోయా. అన్యాయం ముందు సామాన్యుడి ఆక్రందన ఎవరికి వినబడదని తేలిపోయింది. నేటితో ఈ మట్టితో రుణానుబంధం తీరబోతుందని మట్టిని చేతిలోకి తీసుకున్నాడు. కనీసం నన్ను నమ్ముకున్న వాళ్ళకైనా న్యాయం చేయాలని పాసుబుక్కులు, పత్రాలు ఉన్న సంచిని జబ్బకు తగిలించుకొని లేవబోయాడు.

అంతే ‘‘అమ్మా” అంటూ అరిచి నిలువునా కూలిపోయాడు. కళ్ళు మూతపడుతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచి లేచే ప్రయత్నం చేశాడు. పైన పెద్ద కనీ ఏదో విరిగిపడింది. కదలడానికి కూడా వీలుకాలేదు. ఒక ఆకారం అటువైపు పరిగెత్తుకుంటూ రావడం మసకగా అగుపించింది. అతను డ్రైవర్​. పిలవాలి అనుకున్నాడు గొంతు పెగల్లేదు. సైగ చేయాలనుకున్నాడు. చేతులు కదలడం లేదు. డ్రైవర్ మొబైల్ తీసి ఎవరికో ఫోన్​ చేస్తున్నాడు. ఫోన్ పెట్టేసి టార్చ్ లైట్ వెలిగించి అటు ఇటు గాబరాగా తిరుగుతున్నాడు. పది నిమిషాల వ్యవధిలో ఇంకో వ్యక్తి రావడం సెల్ టార్చి వెలుగులో ఆ వచ్చిన వ్యక్తి గమనించాడు. వాళ్ల గుసగుసలు వినపడ్డాయి. అతన్ని సూపర్​వైజర్​గా నిర్ధారించుకున్నాడు మొగులయ్య.‘‘ఎంత పని చేసినావురా బేవకూఫ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నిన్ను నన్ను ప్రాణాలతోని పాతిపెడతరు. ఇది తెలిస్తే ఊరంత అట్టుడుకుతది. నిన్ను నమ్మినందుకు ఇంత సోయిలేకుంట చేస్తావురా” అంటూ సూపర్ వైజర్ డ్రైవర్​ను బండ బూతులతో తిడుతూ తిరుగుతున్నాడు.‘‘నేను బతికే ఉన్నాన్రా నన్ను పైకి లాగండి” అనాలని అనుకుంటున్నా తన గొంతు తనకే వినబడటంలేదు. మాట గొంతు దాటడం లేదు. కొంతసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు డ్రైవర్ అక్కడ నుండి కదిలాడు. అంతే రెండు వైపుల నుండి రెండు పొక్లయినర్లు పెద్ద పెద్ద బండ రాళ్లు, కనీలతో ముందుకు కదులుతూ మొగులయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఆపై వొకదాని తర్వాత వొకటి, ఆగకుండా మట్టిబెడ్డలతో మొగులయ్యను పూర్తిగా కప్పేస్తున్నాయి. చూస్తూచూస్తూనే అచేతనంగా కళ్ళు మూతలు పడ్డాయి. కొద్దిసేపటి తర్వాత అక్కడ ఒక మట్టి దిబ్బ తయారైంది. తెల్లవారి శాస్త్రోక్తంగా జయజయధ్వానాలతో ప్రాజెక్టు ప్రారంభమైంది.

నీళ్లు మెల్లమెల్లగా నిండుతున్నయి. గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంది. నాలుగు గంటల్లో మట్టి దిబ్బ మునిగిపోయింది. ప్రాజెక్టులో ఇల్లు మునిగిపోయినట్టే మొగులయ్య మరణం అసహజం అనే నిజం నీళ్లలోనే సమాధి అయిపోయింది. ఈ పనిచేసి ఆ రోజు రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిన  డ్రైవర్లు ఎప్పటికీ తిరిగి రారు. ఆ ఘోరాన్ని దగ్గరుండి చేయించిన సూపర్ వైజర్ ఎప్పటికీ నోరు విప్పడు. మొగులయ్య మరణం గురించి జనం కథలు, కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఇది ఎప్పటికీ తేలని జలరహస్యం. అది తెలియని కుటుంబం ‘మొగులయ్య ఎప్పటికైనా రాకపోతాడా?’ అని ఎదురుచూస్తూనే ఉంటుంది.

*   *   *

‘‘సార్ త్వరగా రండి. బస్సు బయల్దేరుతుంది” అని కొలీగ్ పిలుపు వినిపించింది.
బరువెక్కిన గుండెతో... వీడ్కోలు పలికి బస్సువైపు కదిలాడు నర్సింహులు సార్. 

కొండి మల్లారెడ్డి
ఫోన్ : 9652199182