JIGRIS Review: తెలుగు యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ కామెడీ ‘జిగ్రీస్‌‌‌‌’ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ మూవీ ఎలా ఉందంటే?

JIGRIS Review: తెలుగు యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ కామెడీ ‘జిగ్రీస్‌‌‌‌’ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ మూవీ ఎలా ఉందంటే?

మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, ప్రధాన పాత్రల్లో హరిష్ రెడ్డి ఉప్పుల రూపొందించిన  చిత్రం ‘జిగ్రీస్‌‌‌‌’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ కృష్ణ వోడపల్లి.. మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై మూవీ నిర్మించారు. శుక్రవారం (2025 నవంబర్ 14న) సినిమా థియటర్లలో విడుదలైంది. చిన్ననాటి స్నేహితులు, నోస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ‘జిగ్రీస్‌‌‌‌’ తెరకెక్కింది. కమ్రాన్ సంగీతం అందించారు. 

ఈ సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తనదైన ప్రమోషన్స్ చేశారు. ‘‘అర్జున్ రెడ్డి నేను ఎలా తీశానో అంతకంటే ఎక్స్‌‌‌‌ట్రీమ్‌‌‌‌గా సినిమా తీశారు. హీరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే ఆడియెన్స్ థియేటర్స్‌‌‌‌కి వెళ్తారు.. హండ్రెడ్ పర్సెంట్ ఆడియెన్స్‌‌‌‌ను నవ్వించే చిత్రమిది’’ అంటూ సందీప్ రెడ్డి వంగా సినిమాపై భారీ అంచనాలు పెంచుకొచ్చారు. 

అందుకు తగ్గట్టుగానే సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించగా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో ఇవాళ ‘జిగ్రీస్‌‌‌‌’ మంచి హైప్ తో థియేటర్స్కి వచ్చింది. నలుగురి కుర్రాళ్ల కథకు.. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారనేది ఆసక్తి రేపుతోంది. మరి ఈ యూత్‌ఫుల్ స్టోరీ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూసేద్దాం.

కథేంటంటే:

ప్రవీన్ (రామ్ నితిన్), కార్తిక్ (కృష్ణ బూరుగుల), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్‌గా మద్యం తాగుతారు. ఈ క్రమంలో వారు గోవా వెళ్లాలని డిసైడ్ అవుతారు. అది కూడా కేవలం మారుతీ 800 కారులోనే వెళ్లాలని అనుకుంటారు. అయితే, వారందరూ తాగిన మైకంలో ఏం చేస్తారో కూడా అర్ధం అవ్వదు.

ఈ క్రమంలో డబ్బు, పర్స్‌లు, మొబైల్స్ అన్ని కింద పడేసుకుని వెళ్తారు. అంతలోనే కారు ట్రబుల్‌ ఇస్తుంది. రిపేర్ కోసం డబ్బులు ఉండవు. ఇంకా చెప్పాలంటే వారి దగ్గర తిండికి కూడా డబ్బులు ఉండవు. ఎలాగో ఎలాగో చేసి కారు రిపేర్ కోసం ఓ మెకానిక్‌ని పిలుస్తారు. అయితే, అతనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. అంతేకాదు.. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. 

అసలు ఈ నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్లాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? అది కూడా మారుతీ 800 కారులోనే ఎందుకు వెళ్లాలని అనుకున్నారు? ఇందులో ప్రశాంత్‌కు ఏమైంది? మెకానిక్‌ వల్ల వచ్చిన ఆ ఇబ్బందులు ఏంటీ? ఇంతకు వీరి గోవా ప్రయాణం వీరిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘జిగ్రీస్‌‌‌‌’ చూడాల్సిందే!!

ఎలా ఉందంటే:

''కథ, కథనం, కామెడీ'' సరిగ్గా వర్కౌట్ అయితే.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైనర్స్ కి విజయం పక్కా. అలా మన తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అయితే, రైటర్, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కి తోడుగా.. ''కడుపుబ్బా నవ్వించే కామెడీ, అందులో థ్రిల్లింగ్ పెంచే అంశాలు, మరికొన్నీ ట్విస్టులు ఉంటే చాలు.." ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడతారు.

‘ఈ నగరానికి ఏమైంది?’, 'జాతి రత్నాలు' అలా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నవే. అయితే, అన్నీ సినిమాలు ఒకేలా ఉండాలని లేదు. కానీ, ఆ తరహా వస్తే సూపర్ హిట్ అవుతాయనేది ముఖ్యోద్దేశ్యం. ఇక ఇపుడు జిగ్రీస్ కూడా కథలో కొన్ని మలుపులు ఇస్తూనే.. కడుపుబ్బా నవ్వించే పాయింట్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

అయితే, నలుగురు ఫ్రెండ్స్‌ కలిసి అనుకోకుండా గోవా వెళ్లడమనే కాన్సెప్ట్ ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీలో ఉంది. కానీ, ‘జిగ్రీస్’ కొంచెం భిన్నమైన కథనంతో తెరకెక్కింది. ముఖ్యంగా నాలుగు విభిన్నమైన క్యారెక్టర్లతో ఉన్న ఓ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి గోవాకు వెళ్లడం, అందుకు డబ్బులు లేకపోవడం, మధ్యలో ఎంట్రీ ఇచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఈ నలుగురిలో ఒక ఫ్రెండ్ ఎదుర్కొనే ఓ రోగం, ఇందులో భాగంగా వచ్చే కామెడీ, ఎమోషనల్ సీన్స్.. ఇదే జిగ్రీస్ స్టోరీ.

జిగ్రీస్లో కథ గురించి చెప్పడం కన్నా.. అందులో వచ్చే కామెడీ పోర్షన్స్, ఎమోషనల్ పోర్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. కథ కంటే కామెడీ & ఎమోషనల్ పోర్షన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా కామెడీ యాంగిల్లో వెళుతూ సెకండాఫ్లో కథలో గ్రిప్ తీసుకొచ్చారు. ఇందులో నలుగురు ఫ్రెండ్స్ ఎంటర్‌టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కృష్ణ బూరుగుల పర్ఫామెన్స్ మొదటి నుంచి చివరి వరకు మెప్పిస్తుంది.

ఒక్కో సీన్ కామెడీతో బాగా నవ్వించేశాడు డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్, కండోమ్ సీన్స్ వంటివి హాయిగా నవ్విస్తాయి. కథలో మావోయిస్టుల బ్లాక్ రావడం, అది మెప్పించే తీరు బాగుంది. ఇక చివర 15 నిమిషాలు అయితే, మనసుని బరువెక్కించాడు. తడిసిన కళ్లతో చెమర్చిన భావోద్వేగంతో బయటకు వచ్చేలా క్లైమాక్స్ సీన్స్ పెట్టారు. ముఖ్యంగా ఆ సీన్‌ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. ఇక నలుగురు ఫ్రెండ్స్‌తో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌‌టైనర్.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎంచక్కా మూవీ చూసేయొచ్చు. 

ఎవరెలా నటించారంటే:

మ్యాడ్ హీరో రామ్ నితిన్ మరోసారి ఆకట్టుకున్నారు. తనదైన స్టైల్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్తో మెప్పించాడు. ఇందులో లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల అదరగొట్టాడు. ఫస్ట్ నుండి క్లైమాక్స్ వరకు తన  పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు.  డైలాగులు, అతని కామెడీ టైమింగ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. ధీరజ్ ఆత్రేయ అమాయకపు యాక్టింగ్‌తో నవ్వించాడు. మని వాక పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. మిగతా క్యారెక్టర్స్ తమ పాత్రలకు సరైన న్యాయం చేశాయి.

టెక్నీకల్ అంశాలు:

సయ్యద్ కమ్రాన్ నేచురల్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నారు. రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈశ్వరాదిత్య సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ప్రతి సీన్ కలర్ఫుల్‌గా, నేచురల్గా చూపించి సక్సెస్ అయ్యారు. ఎడిటర్ చాణక్య రెడ్డి తూరుపు తన కత్తెరతో సినిమాపై క్యూరియారిటీ తీసుకొచ్చారు.

చివరగా.. కథ, దర్శకత్వం వహించిన హరీష్ రెడ్డి ఉప్పుల సూపర్ సక్సెస్ అయ్యారు. కామెడీ అంశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్తో కంటతడి పెట్టించాడు. కథ, కథనానికి కావాల్సిన అన్నీ హంగులతో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇకపోతే.. ఇలాంటి ఒక మంచి కథని తీసుకుని, తెరపై తీసుకురావడంలో మూవీ నిర్మాత, సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి చేసిన ప్రయత్నం మెచ్చుకోవొచ్చు. సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దాడు.