మూడు జిల్లాలు కుతకుత .. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు

మూడు జిల్లాలు కుతకుత .. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు
  • అధికంగా నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, జగిత్యాల జిల్లా జైనలో 46.2 డిగ్రీలు 
  • 11 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా రికార్డు.. 16 జిల్లాల్లో 44కుపైగానే
  • వారంపాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక.. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం మూడు జిల్లాలు మినహా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి.  నల్గొండ, జగిత్యాల, కరీంనగర్​లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, జగిత్యాల జిల్లా జైనలో 46.2 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్​లో 46.1, జగిత్యాల జిల్లాలోని కోల్వాయి, కరీంనగర్ జిల్లా కొత్తగట్టు, వీణవంకల్లో 46 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 45.9, 16 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో మూడు జిల్లాల్లోనూ 43 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

వారంపాటు ఇంతే..

రాష్ట్రంలో వారంపాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు తీవ్రంగా ఉండే ముప్పు ఉందని వార్నింగ్​ ఇచ్చింది. అన్ని జిల్లాలను ఆరెంజ్​ అలర్ట్​ జోన్​లో పెట్టింది. ప్రస్తుతం పసిఫిక్​ మహాసముద్రంలో ఎల్​నినో పరిస్థితులు తగ్గుముఖం పడుతుండడం, హిందూ మహాసముద్రంలో ఇండియన్​ ఓషన్​ డైపోల్​ పాజిటివ్​గా ఉండడంతో పొడిగాలులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. 

జిల్లాలవారీగా టెంపరేచర్లు..

46 డిగ్రీలకు పైగా నమోదైన జిల్లాలు: నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో 46.2, జగిత్యాల జిల్లా జైనలో 46.2, కరీంనగర్​ జిల్లాలోని పలు చోట్ల 46 డిగ్రీలు45 డిగ్రీలకుపైగా నమోదైన జిల్లాలు: సిద్దిపేట 45.9, మంచిర్యాల 45.7, ములుగు, గద్వాల 45.6, నిర్మల్​ 45.5, వరంగల్​ 45.4, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ 45.3, మహబూబాబాద్​ 45.144కుపైగా నమోదైనవి: ఖమ్మం, నారాయణపేట 44.9, సూర్యాపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, వికారాబాద్​, మేడ్చల్ 44.8, సిరిసిల్ల 44.7, కొత్తగూడెం, హనుమకొండ, సంగారెడ్డి 44.6, నిజామాబాద్​, యాదాద్రి 44.5, మహబూబ్​నగర్​, కామారెడ్డి 44.3, రంగారెడ్డి 44 డిగ్రీలు43కిపైగా రికార్డు అయిన జిల్లాలు: ఆదిలాబాద్​ జిల్లా 43.9, మెదక్​ 43.5, హైదరాబాద్​ 43.2