దంచుతున్న ఎండలు..అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీల టెంపరేచర్​

దంచుతున్న ఎండలు..అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీల టెంపరేచర్​
  • పది జిల్లాల్లో 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు
  • మరో మూడు నాలుగురోజులు ఇదే పరిస్థితి 
  • పలు జిల్లాలకు వడగాలుల ఎఫెక్ట్
  • వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : ఐదు రోజుల బ్రేక్​ తర్వాత రాష్ట్రంలో టెంపరేచర్లు మళ్లీ పెరిగాయి. పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో 44.6, మహబూబాబాద్​, రాజన్న సిరిసిల్లలో 44.5, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్​, కరీంనగర్​, సూర్యాపేటలో 44.2, మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.

వచ్చే మూడునాలుగు రోజుల పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం పేర్కొంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్​ జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

టెంపరేచర్లు ఇంకింత పెరుగుతయ్..

వచ్చే మూడు రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీల వరకు నమోదు కావొచ్చంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం 10 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్​ కాగా.. 13 జిల్లాల్లో 43 నుంచి 43.9 మధ్య, 8 జిల్లాల్లో 42 నుంచి 42.9 మధ్య, రెండు జిల్లాల్లో 41 నుంచి 41.9 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జోగుళాంబ గద్వాల 43.9, ఖమ్మం, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి 43.8, వరంగల్​, వనపర్తి 43.7, నిర్మల్​, మహబూబ్​నగర్​ 43.2, నిజామాబాద్​ 43.1, కామారెడ్డి, సిద్దిపేట, నాగర్​కర్నూల్, యాదాద్రి భువనగిరి 43, నారాయణపేట 42.8, రంగారెడ్డి 42.7, జనగామ 42.6, హనుమకొండ, వికారాబాద్​ 42.4, మేడ్చల్​ మల్కాజిగిరి 42.3, సంగారెడ్డి 42.2, ఆదిలాబాద్​ 42, మెదక్​, హైదరాబాద్ లో 41.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.