తెలంగాణలో చల్లబడిన వాతావరణం

తెలంగాణలో చల్లబడిన వాతావరణం

వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి.  రాష్ట్రంలో సోమవారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలులు వీచాయి.  నిన్న మొన్నటి వరకు పలుచోట్ల దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మంగళవారం 40 డిగ్రీలలోపు దిగొచ్చాయి. 

మహబూబ్​నగర్​ జిల్లా వడ్డేమాన్​లో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయింది. వనపర్తి జిల్లాలో 40.7, ఖమ్మంలో 40.4, గద్వాలలో 40.2, నల్గొండ జిల్లాలో 40.1, కొత్తగూడెంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. వర్షాల ప్రభావంతో ఈ నాలుగు రోజులూ టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మంగళవారం నిజామాబాద్​ జిల్లాలోని పలు చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. 

పంటలపై వర్షాల ఎఫెక్ట్​

రాష్ట్రవ్యాప్తంగా పంటలు కోత దశకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు బుగులు పడుతున్నారు. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పది శాతం మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. మిగతా పొలాల్లోనే కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకు తరలించిన ధాన్యాన్ని తడవకుండా కాపాడేందుకు ప్రభుత్వమే టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.