తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత

గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పండితులు మూసివేశారు. ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత.. సంప్రోక్షణ చేసిన మళ్లీ దర్శనానికి అనుమతిస్తారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం.. గ్రహణం పూర్తయిన తర్వాత తెరవనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం పూజలు చేసి ఆలయాన్ని క్లోజ్ చేశారు. 

మరోవైపు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్  జిల్లాలోని అలయాలన్నీ మూతబడ్డాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం.. రాత్రి 8 గంటల తర్వాత తెరవనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కవాట బంధనం చేశామని చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. సాయంత్రం 6.40 తర్వాత శుద్ధి పుణ్యహవచనం, స్వామివారికి ఏకాంత సేవ ఉంటుందన్నారు.  

ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించినా.... హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.