చత్తీస్​గఢ్ అడవుల్లో  మరో ఎన్​కౌంటర్ .. 10 మంది మావోయిస్టులు మృతి 

చత్తీస్​గఢ్ అడవుల్లో  మరో ఎన్​కౌంటర్ .. 10 మంది మావోయిస్టులు మృతి 
  • మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, ముగ్గురు మహిళలు   
  • ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు  
  • బస్తర్ డివిజన్​లోని నారాయణ్​పూర్ జిల్లాలో ఘటన  

భద్రాచలం, వెలుగు:  దండకారణ్యంలోని అబూజ్ మఢ్ అడవుల్లో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో10 మంది మావోయిస్టులు మృతిచెందారు. -మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు కమాండర్ మల్లేశ్ కుంజాం, మరో కీలక నేత కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టు గుర్తించారు.

మహారాష్ట్ర బార్డర్​లో చత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ నారాయణ్​పూర్ జిల్లా పాగుడ్​-టేక్మెట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ మావోయిస్టులు సమావేశమవుతున్నారని పక్కా సమాచారం అందడంతో డీఆర్​జీ, ఎస్టీఎఫ్​బలగాలు మెరుపుదాడి చేశాయి. బస్తర్ ఐజీ సుందర్​రాజ్, నారాయణ్​పూర్ ఎస్పీ ప్రభాత్​కుమార్ పర్యవేక్షణలో ఈ కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. 

పక్కా సమాచారంతో కూంబింగ్ 

ఇటీవల చత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ కాంకేర్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. 80 మందికి పైగా మావోయిస్టులు మరణించడంతో ఆధిపత్యం కోసం భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దాడులకు స్కెచ్ వేశారు. అయితే, నిఘా వర్గాల సమాచారంతో బస్తర్ ఐజీ సుందర్​రాజ్ మావోయిస్టుల వ్యూహాన్ని భగ్నం చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. నారాయణ్​పూర్ జిల్లా కేంద్రం నుంచి డీఆర్​జీ, ఎస్టీఎఫ్ బలగాలను కూంబింగ్​కు పంపించారు.

పాగుడ్​-టేక్మెట్ట అటవీ ప్రాంతంలో జేసీబీల సాయంతో బంకర్లు ఏర్పాటు చేసుకుని, మీటింగ్ పెట్టిన మావోయిస్టుల ఉనికిని గుర్తించారు. మీటింగ్​కు పెద్ద సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు మంగళవారం ఉదయం 6  గంటల సమయంలో సేద తీరుతుండగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సుమారు రెండు గంటల పాటు ఇరు వర్గాల మధ్య   కాల్పుల మోతతో అడవి దద్దరిల్లింది.

పారిపోతున్న మావోయిస్టులను  భద్రతా బలగాలు వెంటాడాయి. మధ్యాహ్నం వరకు ఆపరేషన్ కొనసాగింది. వేర్వేరు చోట్ల మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకె-47, ఇన్సాస్ ఆయుధాలతో పాటు భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలు, కంప్యూటర్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 30 క్వింటాళ్ల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు కూడా దొరికాయి. బంకర్లు తవ్వేందుకు వినియోగించిన జేసీబీని కూడా గుర్తించారు. 
 
అడవిలోకి బ్యాకప్​ బలగాలు 

అబూజ్ మఢ్ అటవీ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట కావడంతో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు బ్యాకప్ బలగాలను పంపించారు. బస్తర్ ఐజీ సుందర్​రాజ్, నారాయణ్​పూర్​ జిల్లా ఎస్పీ ప్రభాత్​కుమార్ మూడు వైపుల నుంచి బలగాలను పంపించి మావోయిస్టుల దళాలను నియంత్రించేలా చర్యలు చేపట్టారు.

ఎన్​కౌంటర్ తర్వాత గుట్టలు, వాగులు దాటుకుంటూ మృతదేహాలు, ఇతర వస్తువులు తీసుకురావడం పెను సవాల్ గా ఉంటుంది. దెబ్బతిన్న మావోయిస్టులు వీరిపై అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీరికి రక్షణగా బ్యాకప్ బలగాలను పంపారు. కూంబింగ్ టీమ్ తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐజీ తెలిపారు.