హైదరాబాద్-విజయవాడ హైవేకు త్వరలో టెండర్లు..రూ.6,250 కోట్లతో 6  లేన్లకు విస్తరణ

హైదరాబాద్-విజయవాడ హైవేకు త్వరలో టెండర్లు..రూ.6,250 కోట్లతో 6  లేన్లకు విస్తరణ
  • డీపీఆర్‌‌‌‌ను కేంద్రానికి పంపిన ఎన్‌‌హెచ్ఏఐ
  • ప్రాజెక్టును ఆమోదిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే (ఎన్‌‌హెచ్– 65 ) విస్తరణకు ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో  టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం 4 లేన్స్‌‌గా ఉన్న ఈ హైవేను 6  లేన్స్‌‌కు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌‌‌‌ను కేంద్రానికి ఎన్‌‌హెచ్ఏఐ (నేషనల్ హైవేస్​ అథారిటీ ఆఫ్ ఇండియా ) పంపించింది.  4 లేన్ల నుంచి 6  లేన్ల విస్తరణకు రూ. 6,250 కోట్లు వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు.

 ఇందులో రోడ్డు విస్తరణతోపాటు సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు.  ఈ హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఈ ఏడాది జనవరి నుంచి 569 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 56 మంది చనిపోయారు. ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందిన విషయాన్ని గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి వివరించారు. 

ఈ నెల 15న అప్రూవల్

నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ హైవేను 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించాలన్న ప్రపోజల్ ఎన్నో ఏండ్లుగా ఉన్నది. గత 20 నెలల నుంచి ఢిల్లీ వెళ్లినపుడు  ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్​రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  ప్రతిపాదిస్తున్నారు. దీనికి కేంద్రం అంగీకరించడంతో డీపీఆర్ తయారీ టెండర్ మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఆ కన్సల్టెన్సీ రెడీ చేసిన టెండర్‌‌‌‌ను ఎన్‌‌హెచ్ఏఐకి అందజేశారు.  

ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ గడ్కరీకి రాష్ట్ర ఎంపీలతో కలిసి మంత్రి వెంకట్‌‌రెడ్డి ప్రతిపాదించగా.. అంగీకరించారు. ఈ నెల 15న ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఈ విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ నెలలోనే టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  కాగా, సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్‌‌‌‌లో పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ హైవే విస్తరణ తెలంగాణలోని దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల మేర జరుగనున్నది. అదనంగా గొల్లపూడి వరకు విస్తరణను పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ  సీఎం చంద్రబాబు కోరగా.. కేంద్రం ఆమోదించింది. కాగా, ఈ హైవేను 2  లేన్ల నుంచి 4  లేన్లకు విస్తరించే సమయంలో (2010లో) భవిష్యత్తు విస్తరణను దృష్టిలో ఉంచుకొని  8  లేన్ల వరకు భూసేకరణ చేశారు.  ఇప్పుడు భూమి అందుబాటులో ఉండటంతో భూసేకరణ వ్యయం మిగలడంతోపాటు ప్రాజెక్టు వేగంగా ముందుకు వెళ్తుందని ఎన్ హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. 

ఫ్యూచర్ సిటీ నుంచి కొత్త హైవే

హైదరాబాద్– విజయవాడ మధ్య నిర్మించనున్న కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌కు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్‌‌హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రాష్ట్రాల రాజధానులను కనెక్ట్ చేసేలా ప్రస్తుతం ఉన్న హైవేకు ప్రత్యామ్నాయ రూట్‌‌లో దీన్ని నిర్మించనున్నారు. 210 నుంచి 220 కి.మీ విస్తీర్ణంలో కొత్త హైవే ఉండనుంది. ప్రస్తుత హైవే హైదరాబాద్ నుంచి నార్కట్‌‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట, కంచికర్ల మీదుగా విజయవాడ వరకు 270 కి.మీ ఉంది.

రీజనల్ రింగ్ రోడ్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ నుంచి ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావాల్సి ఉండగా.. తాజాగా ఫ్యూచర్ సిటీ నుంచి స్టార్ట్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం అంగీకరించింది. ఫ్యూచర్ సిటీ నుంచి నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అమరావతి వరకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. కాగా, ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి 3 లేదా 6 నెలలు గడువు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త హైవేలో ఇపుడున్న హైవేతో పోలిస్తే 70 కి.మీ దూరం తగ్గనుంది.