
రాజకీయ ఘర్షణలతో బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నలుగురు కార్యకర్తల హత్యలకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్ నిర్వహిస్తోంది. పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. రైల్ రోకో నిర్వహించారు. బంద్ తో 24 పరగణా జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బెంగాల్ సర్కార్ భారీగా అదనపు బలగాలను మోహరించింది. నిరసనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు.
కేంద్రప్రభుత్వం ఆరా
బెంగాల్ హింసపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గవర్నర్ త్రిపాఠి నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది కేంద్ర హోంశాఖ. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని మమత సర్కార్ కు నోట్ పంపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీతో ఆయన సమావేశం అవుతున్నారు. హింసపై ప్రధాని అడిగితే నివేదిక ఇస్తానని చెప్పారు త్రిపాఠీ.
బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
బెంగాల్ లో మమత బెనర్జీ హింసా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ ఆరోపించారు. హత్యకు గురైన కార్యకర్తల మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. బెంగాల్ పోలీసులు టీఎంసీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ముకుల్ రాయ్ మండిపడ్డారు.