డబుల్​ బెడ్​రూం ఇండ్ల పేరుతో భూమి లాక్కున్నారని యువకుడి ఆత్మహత్య

డబుల్​ బెడ్​రూం ఇండ్ల పేరుతో భూమి లాక్కున్నారని యువకుడి ఆత్మహత్య

నర్సాపూర్ (హత్నూర), వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పేరుతో భూమిని లాక్కున్నారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు  దిగారు. మృతదేహంతో రాస్తారోకో చేయడం, వారికి మద్దతుగా వచ్చిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన  జక్క మల్లేశం పేరు మీద ఎకరా అసైన్డ్ భూమి ఉంది. పొజిషన్ సరిగా లేదని, సర్వే చేయాలని చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి డబుల్​ బెడ్​రూం ఇండ్ల పేరుతో తన భూమి లాక్కున్నాడని, న్యాయం చేయాలని మల్లేశం గతంలో సంగారెడ్డి కలెక్టరేట్​లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

భూమి సర్వే కోసం రెండుసార్లు తేదీలు ప్రకటించిన అధికారులు సర్వే చేయకపోవడంతో మనస్థాపానికి గురైన మల్లేశం కొడుకు జక్క నందీశ్వర్ (26) సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మరణానికి పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డే కారణమంటూ మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు నర్సాపూర్ - సంగారెడ్డి రోడ్డుపై డెడ్ బాడీతో ధర్నా చేశారు. న్యాయం చేసే దాకా కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి వచ్చి మృతుడి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆర్డీఓతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పగా, అధికారుల మీద తమకు నమ్మకం లేదని ఆందోళన విరమించేందుకు ఒప్పుకోలేదు. నాలుగు గంటలకు  పైగా బైఠాయించడంతో ట్రాఫిక్ ​నిలిచిపోయింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి గుమిగూడిన వారిని చెదరగొట్టి డెడ్ బాడీని సంగారెడ్డి దవాఖానాకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పరామర్శించడానికి వచ్చిన టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు హకీమ్, ఎన్ఎస్ యుఐ, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ లీడర్లు రఘువీరారెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్​కు తరలించారు.