ఏటూరు నాగారంలో ఉద్రిక్తత.. అయ్యప్ప భక్తులకు, బైరి నరేశ్​కు మధ్య లొల్లి

ఏటూరు నాగారంలో ఉద్రిక్తత.. అయ్యప్ప భక్తులకు, బైరి నరేశ్​కు మధ్య లొల్లి
  • నరేశ్​​ ప్రసంగాన్ని అడ్డుకున్న అయ్యప్ప స్వాములు
  • నరేశ్​ కారు తగిలి ఓ భక్తుడికి గాయాలు
  • వేగంగా వెళ్లి చెట్టును ఢీకొన్న కారు  
  • అనుమతి లేని సదస్సులో పాల్గొన్న నరేశ్​పై కేసు నమోదు

ఏటూరునాగారం, వెలుగు :  నాస్తిక సంఘానికి చెందిన  బైరి నరేశ్‌‌, అయ్యప్ప మాలధారులకు మధ్య  ములుగు జిల్లా ఏటూరునాగారంలో సోమవారం మరోసారి గొడవ జరిగింది. తనను అడ్డుకున్న అయ్యప్ప స్వాములను  తప్పించుకుని వెళ్తున్న క్రమంలో  నరేశ్​ కారు ఢీకొని ఓ భక్తుడు గాయపడ్డాడు. దీంతో నరేశ్​కు వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. భీమా కోరేగామ్ ​స్ఫూర్తి దినం సందర్భంగా నిర్వహించిన  సదస్సులో పాల్గొనేందుకు   నరేశ్‌ ‌ఏటూరు నాగారం వచ్చాడు.

విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రసంగాన్ని అడ్డుకున్నారు.  గతంలో అయ్యప్పపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.  గతంలోనే క్షమాపణ చెప్పానని, మీ మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే మళ్లీ క్షమాపణ చెప్తానని నరేశ్​ పేర్కొన్నా వెనక్కి తగ్గలేదు. గొడవ పెరగడంతో నరేశ్ ​వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అతని కారు  పోగు నర్సింహారావు అనే భక్తుడిని ఢీకొట్టింది. అతడి రెండు కాలి వేళ్లు విరిగిపోయాయి. దీంతో ఆగ్రహం చెందిన భక్తులు  నరేశ్​ను  అరెస్టు చేయాలని రోడ్డుపై  బైఠాయించారు.

తనను అరెస్ట్​ చేస్తారన్న అనుమానంతో వరంగల్  వైపు వెళ్లాల్సిన నరేశ్​  మంగపేట వైపు  వేగంగా  వెళ్తుండగా  అతడి కారు ప్రమాదవశాత్తు  చెట్టుని ఢీ కొట్టింది.  ఎయిర్​బెలూన్లు ఓపెన్​కావడంతో నరేశ్‌,  అతడి కుటుంబసభ్యులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సదస్సుకు ముందుగా అనుమతి తీసుకోలేదని, శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా నరేశ్‌ వ్యవహరించారంటూ ఏటూరునాగారం పోలీసులు కేసు నమోదు  చేశారు. నరేశ్​ కోసం గాలిస్తున్నట్లు సీఐ మండల రాజు తెలిపారు.  అయ్యప్ప  భక్తుడు గాయపడిన ఘటనలో కారును నరేశ్‌‌ నడపలేదని నిర్వాహకులు తెలిపారు.  అయ్యప్ప భక్తులు వెంటపడడంతో వేగంగా వేళ్లే ప్రయత్నంలో కారు చెట్టుకు ఢీకొని  నరేశ్‌‌ తలకు,  ఎడమ కన్ను, ముక్కుకి గాయాలయ్యాయని,  ఆయన భార్య సుజాత, పెద్ద కొడుకు,  డ్రైవర్​ స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు.