పోలీసుల పహారాలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు షురూ

 పోలీసుల పహారాలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు షురూ

సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అధికారులు తిరిగి ప్రారంభించడంతో గుడాటిపల్లిలో టెన్షన్​ నెలకొంది. పెండింగ్ పరిహారాలు పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేస్తుండగానే అధికారులు తిరిగి కట్ట పనులు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్‌ ‌నియోజకవర్గం అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు దశాబ్దంన్నరగా సాగుతూ వస్తున్నాయి.  2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ 1.43 టీఎంసీల కెపాసిటీతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.  

ప్రాజెక్టు వ్యయం రూ. 823.60 కోట్లు కాగా రెండు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. కానీ పనులు సక్రమంగా జరగలేదు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవెల్లి కెపాసిటీని 8.23 టీఎంసీలకు  రీడిజైన్ చేసి రూ. 1,100 కోట్ల అంచనా వ్యయంతో  పనులు ప్రారంభించింది. రీడిజైన్ తో 3,870 ఎకరాలు సేకరించాల్సి రావడంతో  గుడాటిపల్లితోపాటు మరో ఐదు గిరిజన తండాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు ట్రయల్ రన్ మూడు నెలల క్రితం నిర్వహించినా రెండు చోట్ల కట్ట పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి దాదాపు 90 శాతానికిపైగా భూ పరిహారాల చెల్లింపు పూర్తయినా ముంపుగ్రామమైన గుడాటిపల్లికి చెందిన దాదాపు 500 మందికి పరిహారం, ప్యాకేజీలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు.

ఏడాదిలో రెండు మూడుసార్లు అధికారులు పనులు ప్రారంభించాలని ప్రయత్నించగా నిర్వాసితులు ప్రతిఘటించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 150 మంది ఎస్టీ కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇండ్ల జాగల పరిహారం, 18 సంవత్సరాలు నిండినవారికి రూ. 8 లక్షలు, 14 ఇండ్లు, 85 ఎకరాలకు పరిహారం ఒకేసారి  చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్​చేస్తున్నారు. గుడాటిపల్లి నిర్వాసితులతో చర్చలు జరుగుతుండగానే శుక్రవారం సాయంత్రం పోలీసుల పహారాలో  పనులను ప్రారంభించారు. 

కుందనివారిపల్లె వైపు షురూ

గౌరవెల్లి ప్రాజెక్టు కట్టకు సంబంధించి కుందనివారిపల్లె వైపు పోలీసుల పహారాలో పనులు ప్రారంభించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ తోపాటు వరంగల్ అర్బన్ పోలీసులు, సీఆర్పీఎఫ్​, రిజర్వ్ ఆర్మ్​డ్ పోలీస్ బలగాలను ప్రాజెక్టు చుట్టూ మోహరించారు. ప్రాజెక్టుకు దారి తీసే మార్గాలతోపాటు హుస్నాబాద్ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్​ వద్ద ​బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాసితులు గుడాటిపల్లి వద్ద దీక్షా శిబిరంలో నిరసన కొనసాగిస్తుండటంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పనులు జరిగే చోటుకు నిర్వాసితులు వెళ్లకుండా అక్కడే ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులు ప్రాజెక్టు చుట్టుపక్కల  కాపలా కాస్తున్నారు. శుక్రవారం పనులను లాంఛనంగా ప్రారంభించినా శనివారం మాత్రం ముమ్మరంగా సాగాయి. దాదాపు 500 మీటర్ల మేర కట్ట పనులు జరగాల్సి ఉండటంతో జేసీబీలు, టిప్పర్లు, ఇంతర మెషీన్లతో జోరుగా సాగిస్తున్నారు. కుందనివారిపల్లె వైపు పనులు పూర్తయిన తర్వాత రామవరం రోడ్డు వైపు కట్ట పనులను ప్రారంభించే అవకాశం ఉంది.  రామవరం రోడ్డులో గుడాటిపల్లి నిర్వాసితులు దీక్షలు నిర్వహిస్తుండటంతో  ఇక్కడ పనులు ప్రారంభించేటప్పుడు అడ్డుకునే అవకాశాలు వున్నాయి. పూర్తి పరిహారాలు చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీపై నిలబడకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నించగా అక్కడే నిర్వాసితులు నిరసన దీక్షలు ప్రారంభించి కొనసాగిస్తూ వస్తున్నారు. పనులు మళ్లీ షురూ చేయడంతో శనివారం నిర్వాసితులు అందరూ దీక్షా శిబిరం వద్ద సమావేశమై భవిష్యత్తు ఆందోళనపై చర్చించారు. ప్రస్తుతం రామవరం రోడ్డు వైపు కట్ట పనులు ప్రారంభం కాకపోవడంతో వేచి చూడాలనే ధోరణితో నిర్వాసితులు ఉన్నారు. గుడాటిపల్లి నిర్వాసితుల్లో కొందరు పరిహారం చెక్కులు తీసుకోవడంతో.. అధికార పార్టీ నేతలు కుట్రలు చేసి తమ ఐక్యతను దెబ్బతీశారనే భావనతో నిర్వాసితులు ఉన్నారు. 

రీ డిజైన్ పేరిట అన్యాయం 

పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు కడితే ఇంత  నష్టం జరుగకపోవు. టీఆర్ఎస్ వచ్చి రీడిజైన్  పేరిట ప్రాజెక్టు ఎత్తు పెంచి ఊర్ల ఎవలూ  మిగలకుండ జేసి అందర్ని ఆగం జేసిండ్రు.  నాలుగెకరాల భూమి  పైసలతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ,   పశువుల కొట్టానికి  పైసలు ఇంతవరకు ఇయ్యలే. ఇప్పుడేమో పరిహారాలు పూర్తిగా ఇవ్వకుండా పోలీసులను పెట్టుకుని పనులు చేస్తుండటం అన్యాయం.
‌‌- బద్దం బాల్ రెడ్డి, గుడాటిపల్లి

ప్రాజెక్టుతో బతుకులు ఆగమైనయి

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో మా బతుకులను గవర్నమెంట్ ఆగం చేసింది. ప్రాజెక్టు కింద  15 ఎకరాల భూమి పోయినా 11 ఎకరాలకే పైసలు ఇచ్చిండ్రు. ఇంకా నాలుగెకరాలకు ఇయ్యమని తిరుగుతున్నా ఇత్తలేరు.  పొత్తుల ఉన్న ఇంటి జాగ ఇరవై గుంట లు, ఇద్దరు పిల్లలకు ఆర్అండ్ఆర్  ప్యాకే జీ పైసలు రాలే. పద్నాలుగేండ్లసంది గోస పడుతున్నం. ఇప్పుడు పోలీసులను పెట్టుకుని  పనులు జేత్తండ్రు. 

- మేడబోయిన స్వరూప, నిర్వాసితురాలు