శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే తీవ్ర గందరగోళం చెలరేగింది. పలు ప్రజా సమస్యలపై ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోమవారం శ్రీనగర్‌లో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులు, మాజీ మంత్రి ముస్తఫా కమల్‌తోపాటు పలువురికి స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ సంతాపం తెలిపారు.
సంతాప తీర్మానాలు ముగియగానే ప్రతిపక్ష బీజేపీ సభ్యులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమస్యలు, డైలీ వేజ్ కార్మికుల క్రమబద్ధీకరణ, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి పలు కీలక ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఆందోళనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర నినాదాలతో సభ దద్దరిల్లింది. గందరగోళం తీవ్రత ఎక్కువ కావడంతో ఉదయం 11 గంటలకే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
