
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సోమవారం ఉదయం మార్నింగ్‌వాక్‌లో హత్యకు గురైన చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గజ్వేల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి స్వగ్రామమైన గుర్జకుంటకు తీసుకురాగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. మంగళవారం మళ్లీ వచ్చి కుటుంబసభ్యులను ఓదారుస్తున్న క్రమంలో వారు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. నిందితులను పట్టుకువచ్చేంత వరకు శవాన్ని తీసే ప్రసక్తేలేదని ఆందోళన చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆయన వారికి నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే మల్లేశం బంధువులు, కుటుంబసభ్యులు పక్కనే ఉన్న ఓ అనుమానితుడి ఇంటిపై దాడి చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
తాళాలు వేసి ఉన్న ఇంటి కిటికీ అద్దాలతో పాటు ఆవరణలోని కారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు అప్రమత్తమై వారిని పంపించివేశారు. చివరకు మధ్యాహ్నం 1గంటకు అంతిమయాత్ర మొదలైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, వేలేటి రాధాకృష్ణ శర్మ పాడె మోశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాణి, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, బీఆర్ఎస్ లీడర్ నాగపురి కిరణ్‌కుమార్ పాల్గొని నివాళులర్పించారు.