ఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌లో టెన్షన్

ఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌లో టెన్షన్
  • అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్లపైనే అవసరం
  • సవాల్‌‌గా మారిన నిధుల సమీకరణ
  • ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులకు ఇప్పటికే కటకట
  • ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికి దళితబంధు ఇస్తమని.. 200 మందికి కుదింపు
  • ఇతర పథకాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం
  • స్కీమ్‌‌లన్నీ నడుస్తున్నయని చెప్పుకునే ప్లాన్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే ఉండడం.. 2014 నుంచి ఇచ్చిన హామీల లక్ష్యాన్ని పావు వంతు కూడా చేరకపోవడం టీఆర్ఎస్‌‌ను టెన్షన్ పెడుతున్నది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు, ఇతర సందర్భాల్లో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు, ప్రకటించిన పథకాలకు నిధులెట్ల అని రాష్ట్ర సర్కారులో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే రెవెన్యూ లోటుతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్లకు బిల్లులను కష్టంగా సర్దుబాటు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్కార్ ముందు భారీ టార్గెట్ కదలాడుతున్నది. కేవలం పెండింగ్ హామీల అమలుకే రూ.54,700 కోట్లకు పైగా అవసరం. అదే అర్హులందరికీ స్కీములన్నీ పూర్తి స్థాయిలో అందాలంటే అయ్యే ఖర్చు రూ.3 లక్షల కోట్లపై మాటే. దీంతో దళిత బంధు, గిరిజన బంధు, సొంతజాగలో ఇంటి నిర్మాణానికి సాయం, రైతు రుణమాఫీ, గొల్లకురుమలకు గొర్రెలు, భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ల లాంటి ఎన్నో స్కీమ్ ల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సొంత జాగలో ఇంటి నిర్మాణానికి 12 వేల కోట్లు

2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా సొంతిల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటున్న కుటుంబాలు 24,58,381 ఉన్నాయి. ఎనిమిదేండ్లలో ఈ సంఖ్య మరో రెండు లక్షలకు పెరిగి ఉంటుందని అంచనా. సొంత జాగలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల నగదు సాయం అందించనున్నట్లు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని పేర్కొంది. కానీ మూడున్నరేండ్లపాటు ఈ స్కీమ్‌‌ను అటకెక్కించిన ప్రభుత్వం.. ఆర్నెల్ల కిందట ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు తగ్గించి 4 లక్షల కుటుంబాల కోసం బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటిదాకా ఈ స్కీమ్‌‌కు సంబంధించిన గైడ్ లైన్స్‌‌ను ఖరారు చేయలేదు. మరో 15 రోజుల్లో రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయడం ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్ హామీ ప్రకారమైనా ఈ స్కీమ్ అమలు కోసం ఆర్నెల్లలో రూ.12 వేల కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది.

కొత్త పథకాలు అమలైతయా?

గత ఎన్నికల హామీలతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ గత బడ్జెట్ సమావేశాల్లో రెండు కొత్త స్కీమ్‌‌లు తీసుకొచ్చారు. ఆయిల్ పామ్ సాగు కోసం 2022–23 సంవత్సరానికి బడ్జెట్‌‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ప్రోత్సాహం కింద రూ.34 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. దీన్ని ప్రకటించి 8 నెలలు దాటినా రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి ఈ సంవత్సరం కొత్తగా దాదాపు 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు నిరాశకు గురవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిళ్లను పంపిణీ చేస్తామని బడ్జెట్ స్పీచ్‌‌లో సీఎం వెల్లడించారు. ఇందుకోసం రూ.1000 కోట్లు కేటాయించారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు సెస్ రూపంలో వచ్చిన డబ్బులే సుమారు రూ.3 వేల కోట్లు మూలుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అలాగే మునుగోడు ఉప ఎన్నికకు ముందు గిరిజనులకు గిరిజన బంధు స్కీమ్‌‌ను అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ స్కీమ్ అమలుకు ఇప్పటి వరకు విధివిధానాలు రూపొందించలేదు. పాత పథకాలకే నిధుల సర్దుబాటు కాని పరిస్థితుల్లో కొత్త స్కీమ్‌‌లు అమలవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతినెల వడ్డీలకే రూ. 1,800 కోట్లు

జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, ఇతర నిర్వహణ ఖర్చులకే సర్కార్ నిధుల కటకటను ఎదుర్కొంటున్నది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చేందుకు వారం రోజుల ముందు నుంచే ఇతర స్కీములకు, బిల్లులకు ఫండ్స్ ఆపేస్తున్నది. ప్రతినెలా యావరేజ్‌‌గా రూ.4 వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్లు ఖర్చు అవుతున్నది. ఆసరా పెన్షన్లకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గతంలో తీసుకున్న అప్పులకు ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీలు రూ.1,800 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ.1,500 కోట్లు తప్పనిసరి. వస్తున్న ఆదాయంలో మెజార్టీగా వీటికే అయిపోతుంది. ఇక కాంట్రాక్టర్ల బిల్లులు ఏండ్లు గడుస్తున్నా మంజూరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2022–23లో రూ.2.45 లక్షల కోట్లతో భారీ బడ్జెట్​ప్రవేశపెట్టింది. అయితే ఈ 8 నెలల్లో వచ్చిన ఆదాయం అందులో 55 శాతం కూడా దాటలేదు. మిగిలిన 4 నెలల్లో పూర్తిస్థాయిలో ఎలా సర్దుబాటు అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పుల్లో కోత పెట్టిదంటూ కేంద్రంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.

భూములను అమ్మేస్తున్నా..

ఆదాయం కోసం ప్రభుత్వం భూములను విచ్చలవిడిగా అమ్ముతూ వస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా దాదాపు రూ.9 వేల కోట్లు ఇలా సేకరించింది. ట్రాన్స్​పోర్ట్​లో వివిధ రకాల టాక్స్​లను పెంచింది. లిక్కర్​ రాబడిని పెంచుకుంటూ పోతున్నది. అయినప్పటికీ బడ్జెట్​లో ప్రకటించిన స్కీములతో పాటు.. గతం నుంచి అమలవుతున్న వాటికి నిధులు విడుదల చేసేందుకు నానా తిప్పలు పడుతున్నది. ఎలాగైనా స్కీములన్నీ అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కొత్త పంథాను ఎంచుకున్నది. ఎన్నోకొన్ని నిధులు ఇచ్చి.. కొద్దిమేర లబ్ధిదారులకు ఇచ్చేస్తే స్కీమ్ నడుస్తున్నదనే భావన తీసుకురావాలని ప్లాన్​ చేస్తోంది. దళితబంధుతో పాటు సొంత జాగా ఉన్నోళ్లకు పైసలు, గొర్రెల పంపిణీ, ఇతరత్రా వంటి వాటికి పావు వంతు నిధులు రిలీజ్ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నది. అందులో భాగంగానే సీఎం ఆదేశాలతో రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ స్కీములకు అరొకర నిధులు కేటాయించి మార్క్ చేస్తున్నది. అంతకంటే ఎక్కువ రావని స్పష్టం చేస్తున్నది. ఈ లెక్కన దళితబంధుకు రూ.2 వేల కోట్లు, సొంత జాగా ఉన్నోళ్లకు రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే ఇవ్వనుంది. వాస్తవానికి గత ఏడాది వరకు ఇష్టారీతిన అప్పులు తీసుకునే వెసులుబాటు ఉండటంతో ప్రభుత్వానికి కలిసొచ్చింది. అలా చేస్తే భవిష్యత్‌‌లో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉందని అప్పులపై ఆర్​బీఐ, కేంద్రం లిమిట్ పెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు (అప్పులు కాకుండా) ఇతరత్రా రూపాల్లో ఆదాయంగా రావాల్సిఉన్నది. కానీ ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 4 నెలల్లో మిగిలిన మొత్తం రావాల్సి ఉన్నది.

రుణమాఫీ కోసం 31 లక్షల మంది ఎదురుచూపులు

రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోలోనూ చేర్చారు. 2018 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 11ను కటాఫ్ డేట్‌‌గా ప్రభుత్వం గైడ్‌‌లైన్స్‌‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 36.68 లక్షల మంది ఉండగా, వారికి రూ.19,198.38 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. రుణమాఫీకి ప్రతి బడ్జెట్‌‌లోనూ నిధులు కేటాయిస్తున్నా.. రిలీజ్ చేయడం లేదు. ఈ నాలుగేండ్ల బడ్జెట్‌‌లో ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించింది. ఈ నిధులన్నీ విడుదల చేసి ఉంటే.. ఈ పాటికే రైతుల రుణాలన్నీ మాఫీ అయ్యేవి. నాలుగు విడతల్లో మొత్తం లోన్లు మాఫీ చేస్తామని చెప్పిన సర్కార్.. నాలుగేండ్లలో రెండు విడతలు కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం రూ.1,179.78 కోట్లు మాత్రమే విడుదల చేయగా.. 5.66 లక్షల మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయి. ఇంకా 31 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.18 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ కావాల్సి ఉంది. పాత లోన్ క్లియర్ చేయనిదే బ్యాంకర్లు కొత్త లోన్ ఇవ్వకపోవడంతో రైతులు బయట అప్పులు చేసి బ్యాంకుల్లో పాత లోన్లు చెల్లించి రెన్యువల్ చేసుకోగా.. ఇంకొందరు పాత లోన్లకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్ చేసుకోని 12 లక్షల మందికి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులో పాత క్రాప్ లోన్లకు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని, అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్లలో ఉన్న తమ డబ్బులను, ఇతర స్కీమ్‌‌ల కింద జమ అయిన డబ్బులను కూడా బ్యాంకులు రుణమాఫీ వడ్డీ కింద కట్ చేసుకుంటున్నాయని వాపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను నాలుగేండ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదు. ప్రభుత్వం వడ్డీ డబ్బులను జమ చేయకపోవడంతో అవి ఏటేటా పెరిగి ఇప్పుడు సుమారు రూ.4 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి.

దళిత బంధుకు ఈ నెలలో రూ.2 వేల కోట్లే

నిధులు లేకపోవడంతో.. దళితబంధు పథకానికి ఈనెలలో రూ.2 వేల కోట్లే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముందుగా ప్రతి నియోజకవర్గంలో 200 మందికే దళితబంధు అందనుంది. తర్వాతి రెండు నెలలకు సర్కారు ఇచ్చే నిధులపై స్పష్టత లేదు. ఒకవేళ సర్కారు నిధులు ఇవ్వకపోతే 200 మందితోనే సరిపెట్టే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైంలో దళిత బంధు స్కీమ్‌‌ను రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ స్కీమ్‌‌లో భాగంగా రాష్ట్రంలోని సుమారు 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఏడాదికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 2022– 23 బడ్జెట్‌‌లో 1 లక్ష 75 వేల కుటుంబాల కోసం రూ.17,700 కోట్లు కేటాయించారు. నియోజకవర్గానికి 1,500 మందికి ఇవ్వాల్సి ఉండగా.. మూడు నెలల కిందట 500 మందికి ఫస్ట్ ఫేజ్‌‌లో ఇస్తామని చెప్పారు. అది కాస్తా 2 వందల మందికి తగ్గింది.