
- కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ
దుబ్బాక, వెలుగు: సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో కమటం నరేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా యూరియా కొరత లేకుండా రైతులకు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని ఆరోపించారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న ఎమ్మెల్యేపై అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. పదేళ్లుగా ఎంపీగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశావని ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు.