
- రీ ట్రైవ్ లో భాగంగా మొక్కలు నాటిన అటవీ సిబ్బంది
- ఉపాధి కోల్పోతున్నామని వాగ్వాదానికి దిగిన బాధితులు
కాగజ్ నగర్, వెలుగు: “దశాబ్దాలుగా సాగు చేసుకుంటుండగా.. ఉన్నట్టుండి భూములను లాక్కుంటే.. మేము బతుకుడెట్లా..? ’’ అంటూ పోడు రైతులు ఫారెస్ట్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాల అటవీ భూమి పోడుగా మారిందని, రీ ట్రైవ్ కోసం ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఆదేశించారు. గత నెల రోజులుగా రీ ట్రైవ్ ప్రయత్నంతో పోడు రైతులు సాగుకు దూరంగా ఉండిపోయారు. పలుమార్లు ఫారెస్ట్ ఆఫీసర్లు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసినా సమస్య కొలిక్కి రాలేదు. రెండు రోజుల కింద ఫారెస్ట్ ఆఫీసర్లు దిందా వాగు ఒడ్డున ఉన్న పోడు భూమిలో మొక్కలు నాటారు.
మంగళవారం కూడా మొక్కలు నాటేందుకు కాగజ్ నగర్ రేంజ్ లోని ఐదు రేంజ్ ల ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది సుమారు వంద మంది వరకు వచ్చారు. దీంతో స్థానిక రైతులు, మహిళలు గుంపు వెళ్లారు. నలభై ఏండ్లుగా సాగు చేసుకుంటుంటే ఇప్పుడెలా భూములు లాక్కుంటారని ఫారెస్ట్ ఆఫీసర్లను పోడు రైతులు నిలదీశారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని, ఫారెస్ట్ భూములు తీసుకోవడం తప్పుకాదనడంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి వాగ్వాదం జరిగింది. అనంతరం పోడు రైతులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎక్కువ మొత్తంలో భూములు ఆక్రమించిన పోడు రైతుల నుంచే రీ ట్రైవ్ చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్బాల్ మొయినుద్దీన్ చెప్పారు. పలుమార్లు రైతులకు పరిస్థితి వివరించామని, కొందరు పోడు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రేంజ్ ఆఫీసర్లు అనిల్ కుమార్, శ్రావణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.