ఎగ్జామ్ బాగా రాయలేదని మనోవేదనతో టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

ఎగ్జామ్ బాగా రాయలేదని మనోవేదనతో టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

ఓ వైపు పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతుంటే.. మరో పక్క ఓ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని మల్రెడ్డిపల్లిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని మనోవేదనకు గురైన ఆ విద్యార్థి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసిన మూడు రోజుల తర్వాత చెరువులో శవమై  తేలడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 
పెద్దెముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన కిష్టప్ప మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నవాడైన రమేష్ యాలాల మండలం మల్రెడ్డిపల్లిలో పెద్దమ్మ వద్ద ఉండి జిల్లా పరిషత్ అగ్గనూరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా పరీక్ష మొదటి రోజు ఏప్రిల్ 3వ తేదీన గౌతమి పాఠశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థి..  తెలుగు పరీక్ష తర్వాత  పరీక్ష బాగా రాయలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత ఇంట్లో తన హాల్ టికెట్ వదిలి రెండు రోజులు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడవ రోజు గ్రామం పక్కనే ఉన్న రెడ్డి చెరువులో శవమై తేలాడు. 
 
అదే రోజు పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటికి రావడం.. పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరగకుండా స్ట్రిక్ట్ చేయడంతో పరీక్ష బాగా రాయలేదని విద్యార్థి మనస్థాపం చెందాడు. ఇంటికి చేరిన రమేష్.. ఈ విషయాన్ని తోటి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో  చెప్పి బాధపడినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న యాలాల ఎస్సై అరవింద్... స్థానికుల సమాచారం మేరకు రమేష్  జాడ కోసం వెతికారు. ఆ తర్వాత గ్రామ సమీపంలోని చెరువులో తేలిన శవం రమేషేదేనని ధృవీకరించారు. అనంతరం శవ పంచనామ పూర్చి చేయించి, తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది

రాష్ట్రంలో పదో తరగతి పేపర్ లీకేజీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏప్రిల్ 3న మొదటి పరీక్ష తెలుగు ప్రారంభం కాగా.. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎగ్జామ్ స్టార్ట్ అయిన నిమిషాల్లోనే పేపర్ బయటికొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత జరిగిన హిందీ పరీక్షలోనూ అదే రిపీట్ అయింది. హనుమకొండలో హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కేసులో ప్రశాంత్ అనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచరుడు ఉన్నాడన్న ఆరోపణలతో ఆయనను ఏప్రిల్ 5న అరెస్టు చేసి, పలు కేసులు నమోదు చేశారు.