
న్యూఢిల్లీ: టెర్రర్ లింకులున్న మొబై ల్ యాప్ ఒకటి గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని ఢిల్లీకి చెందిన ఇన్నెఫు ల్యాబ్ ఆందోళన వ్యక్తంచేసింది. ‘అచ్చే బాతే’ పేరుతో ఉన్న ఈ యాప్ పాకిస్తానీ టెర్రర్ సంస్థ ‘జైషే మహ్మద్’ అనుబంధమని చెప్పింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ రాసిన పుస్తకాలు, ఆడియో సందేశాల లింకులను ఇందులో పొందుపరిచిందని ల్యాబ్ కో ఫౌండర్ తరుణ్ విగ్ చెప్పారు. గత డిసెంబర్లో లాంచ్ చేసిన ఈ యాప్‌ను 5 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. డౌన్లోడ్ చేసుకునే టప్పుడే చాలా విషయాల్లో పర్మిషన్ అడుగుతుందని, తర్వాత మొబైల్ ఆన్‌లో ఉన్నంతసేపూ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుందని తెలిపారు. లొకేషన్ సహా ఫోన్లోని వివరాలన్నీ నిర్వాహకులకు చేరవేస్తుందని విగ్ హెచ్చరించారు.