ఇంద్రకరణ్ లో కొనసాగుతున్న టెక్స్ టైల్ ​ఫ్యాక్టరీ పనులు

ఇంద్రకరణ్ లో కొనసాగుతున్న టెక్స్ టైల్ ​ఫ్యాక్టరీ పనులు
  • పర్మిషన్ ఇవ్వొద్దని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజల విజ్ఞప్తులు
  • అయినా ఆగని ఫ్యాక్టరీ నిర్మాణం
  • గాలి, నీరు లుషితమవుతాయని స్థానికుల ఆందోళన

సంగారెడ్డి/కంది, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్​గ్రామ పంచాయతీ పరిధిలో 14 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ పవన్ టెక్స్ టైల్​ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక నేతలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా గాలి, నీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్ లో గ్రామ పంచాయతీ ఆఫీస్​వద్ద ప్రత్యేక గ్రామసభ నిర్వహించి ఫ్యాక్టరీ పర్మిషన్ రద్దు చేయాలని పంచాయతీ తరపున తీర్మానం చేశారు. తర్వాత ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పొలిటికల్ లీడర్లు మద్దతు తెలిపారు. కానీ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మాత్రం ఆగడం లేదు.  

6 గ్రామాలు..4 వేల ఎకరాలకు ఎఫెక్ట్.. 

ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పొల్యూషన్ వల్ల ఆరు గ్రామాలు, నాలుగు వేల ఎకరాలపై ఎఫెక్ట్​ పడనుంది. ఇంద్రకరణ్ తో పాటు ఎద్దు మైలారం, క్యాసారం, భానూరు, చేర్యాల, జుల్కల్ గ్రామాల పరిధిలో ఈ ప్రభావం 
ఎక్కువగా కనిపించనుంది. ఆయా గ్రామాలలో ఇప్పటికే ఉన్న పొల్యూషన్ ఫ్యాక్టరీ వల్ల వ్యవసాయ భూములు కలుషితం కాగా ఈ ఒక్క ఫ్యాక్టరీ కారణంగా 85 శాతం భూములు పాడవుతాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఈ టెక్స్ టైల్​ ఫ్యాక్టరీ వద్దని ఎంతమంది చెప్పినా యాజమాన్యం మొండిగా వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ పరిశ్రమ ఏర్పాటుకు పర్మిషన్ ఉందా? లేదా? అనేది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. టీఎస్ ఐపాస్ ​నుంచి నేరుగా పర్మిషన్ తెచ్చుకుందని కొందరు.. లేదని మరికొందరు వెల్లడించడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చెప్పినా.. 

ప్రజలకు, రైతులకు టెక్స్ టైల్​ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రమాదకరంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, హెచ్ డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ వ్యతిరేకించారు. ముందుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజలతో కలిసి కలెక్టర్ శరత్ ను కలిశారు. ఫ్యాక్టరీ కట్టేందుకు పర్మిషన్ ఇవ్వొద్దని వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత అధికార పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ నేతృత్వంలో కంది మండల పార్టీ నాయకులు కలెక్టర్ శరత్ ను కలిసి ప్రజలకు మద్దతుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పర్మిషన్ ఆపాలని కోరారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల పిల్లర్ల పనులు కొనసాగించడం గమనార్హం. 

టీఎస్ ఐపాస్ పరిధిలో ఉంది..

ఇంద్రకరణ్ పంచాయతీలో నిర్మించనున్న ఎంఎస్ పవన్ టెక్స్ టైల్ ​అనుమతులు టీఎస్ ఐపాస్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి పర్మిషన్ ఉన్నది.. లేనిది క్లారిటీ లేదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నందున ప్రస్తుతానికి లోపల ఎలాంటి పనులు జరగడం లేదు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

– డీఎల్ పీఓ సతీశ్​రెడ్డి

ఇది చట్టవిరుద్ధం

పొల్యూషన్ తో కూడిన టెక్స్ టైల్​పరిశ్రమ గ్రామ పరిధిలో ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం. ఈ ఒక్క ఫ్యాక్టరీతోనే 85 శాతం పొల్యూషన్ వచ్చే చాన్స్​ ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలతో గాలి, నీరు కలుషితమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి.

– శ్రీధర్ రెడ్డి, వార్డు మెంబర్, ఇంద్రకరణ్