ఇవాల్టి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ : అక్టోబర్ 27 వరకు ఏడు పరీక్షలు

ఇవాల్టి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ : అక్టోబర్ 27 వరకు ఏడు పరీక్షలు
  • మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఎగ్జామ్​
  • హాజరు కానున్న 31,383 మంది 
  • జీహెచ్​ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లో 46 సెంటర్లు 
  • తొలి రోజు క్వాలిఫైయింగ్ పేపర్‌ ఇంగ్లిష్
  • అభ్యర్థుల ఆందోళనతో భారీగా బందోబస్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  గ్రూప్‌‌–-1 మెయిన్స్ పరీక్షలకు టీజీ​పీఎస్సీ సర్వం సిద్ధంచేసింది. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అంటెండ్ కానుండగా, వారికోసం 46  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 సెంటర్లున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్​ జరగనున్నాయి.  అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క సీసీ కెమెరాల ద్వారా టీజీ​పీఎస్సీ అధికారులు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ తోపాటు పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను టీజీపీఎస్సీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. 

ఇయ్యాల క్వాలిఫైయింగ్​ పరీక్ష

తొలిరోజు సోమవారం క్వాలిఫైయింగ్ టెస్ట్​ ఇంగ్లిష్​ ఉంటుంది. ఆ తర్వాత  వరుసగా ఆరు వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఆరు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ర్యాంకింగ్ ఫైనల్ అవుతుంది. ప్రతి పేపర్‌‌కు 150 మార్కులు ఉంటాయి. అయితే, ఇంగ్లిష్​ పేపర్​ మినహా మిగిలిన అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లిష్​, ఉర్దూ మీడియంలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. అభ్యర్థులు ఎంచుకున్న మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్లు ఒక మీడియంలో రాసి, మరికొన్ని వేరే మీడియంలో రాస్తే ఆ అభ్యర్థిని ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. ఒకే జవాబు పత్రంలో సగం ఒక మీడియంలో, మరికొంత మరో మీడియంలో రాసినా అది చెల్లుబాటు కాదని స్పష్టత ఇచ్చింది.

12.30 గంటల నుంచే లోనికి అనుమతి

పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.  సెంటర్లలోకి మధ్యాహ్నం12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. 1.30 గంటల తర్వాత అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. మరోపక్క  దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని అదనంగా కేటాయించనున్నారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా మెన్షన్​ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4  కేంద్రాలను ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. మరోపక్క అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం  ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనున్నది. 

563 పోస్టుల భర్తీ..    

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది జూన్ 9న గ్రూప్ –1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. 4.03 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లై చేసుకోగా, 3.02 లక్షల మంది అటెండ్ అయ్యారు. జూలై 7న ఈ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్​ను టీజీ​పీఎస్సీ అధికారులు రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 31,383 మందిని ఎంపిక చేశారు. అయితే, కొన్ని కేటగిరీల్లో తక్కువ మంది ఎంపికైతే 1:50 రేషియో వచ్చేలా ఎంపిక చేశారు. 

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్​

అక్టోబర్ 21 :    జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్)
అక్టోబర్ 22 :    పేపర్-1 (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 :    పేపర్-2 (హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్)
అక్టోబర్ 24 :    పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కాన్‌‌స్టిట్యూషన్, గవర్నెన్స్)
అక్టోబర్ 25 :    పేపర్-4 (ఎకానమీ అండ్​ డెవలప్‌‌మెంట్)
అక్టోబర్ 26 :    పేపర్-5 (సైన్స్ అండ్​ టెక్నాలజీ, డేటా ఇంటర్‌‌ప్రిటేషన్)
అక్టోబర్ 27 :    పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)